Reading Time: < 1 minute

ఆగస్ట్ 27 నుంచి హైదరాబాద్లోని ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లాటరీ

Caption of Image.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు ఆగస్ట్ 27 నుంచి లాటరీ నిర్వహించనున్నట్లు ఎండీ వీపీ గౌతమ్ ప్రకటించారు. రోజుకు 4 నియోజకవర్గాల చొప్పున 30 నాటికి ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. హౌసింగ్ బోర్డు అధికారులు, మీడియా సమక్షంలో లాటరీని పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

లాటరీ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. దరఖాస్తుదారుల వివరాలను గురువారం సాయంత్రం నుంచి మీ సేవవెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. అభ్యంతరాలుంటే 23 సాయంత్రం లోగా తెలియజేయవచ్చన్నారు. అనంతరం అర్హులైన దరఖాస్తుదారుల తుది జాబితాను 25న ప్రకటిస్తామని ఎండీ తెలిపారు.

ఇందిరమ్మ ఎల్ఐజీ టవర్స్కు దరఖాస్తు చేసిన అర్హులు, అనర్హుల లిస్ట్ను పబ్లిక్ డొమైన్లో పెట్టేందుకు హౌసింగ్ బోర్డు అధికారులు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అప్లికేషన్ రిజెక్ట్ అయితే అందుకు కారణాలను కూడా వెబ్ సైట్లో వెల్లడించనున్నారు. లిస్ట్లపై అభ్యంతరాలు ఉంటే ప్రజలు చెప్పేందుకు గడువు ఇవ్వనున్నారు. క్యూర్ పరిధిలో ప్రభుత్వం నిర్మించనున్న ఇందిరమ్మ ఎల్ఐజీ టవర్స్కు ఇప్పటికే అప్లికేషన్లు తీసుకున్న సంగతి తెలిసిందే.

16 నియోజకవర్గాల్లో 7,340 ఫ్లాట్ల కోసం సుమారు 61,500 అప్లికేషన్లు వచ్చాయి. ప్రస్తుతం సీజీజీ ఆధ్వర్యంలో 360 డిగ్రీ విధానంలో ఆన్లైన్లో అప్లికేషన్లను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేశారా? ఫ్లాట్ కు అర్హులా? అనర్హులైతే ఎందుకు? అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయింది? అనే వివరాలను అధికారులు వెబ్ సైట్లో స్పష్టంగా పెట్టనున్నారు.

©️ VIL Media Pvt Ltd.