
- రేవంత్ లండన్‌లో ఉండగా అనుమతి నిరాకరణ..
- 24న బ్రిటన్ నుంచే రిటర్న్ రానున్న ముఖ్యమంత్రి
- కేంద్రం తీరుపై సీఎం రేవంత్రెడ్డి అసహనం
- యువత ఫ్యూచర్ పై సంకుచిత రాజకీయాలు తగవు
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్‌ను మారుస్తం
- యూఎస్‌లో ఒప్పందాలు చేసుకోవాలని ఆఫీసర్లకు ఆదేశం
- లండన్ లో ఆక్స్ ఫర్డ్ వర్సిటీని సందర్శించిన సీఎం
- గ్లోబల్ సమిట్‌కు రండి: వర్సిటీ ప్రతినిధులకు రిక్వెస్ట్
- ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు‘ఆక్స్ ఫర్డ్’ ఆసక్తి
హైదరాబాద్, వెలుగు:సీఎం అమెరికా పర్యటనకు కేంద్రం నో చెప్పింది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ఉన్నత స్థాయి అధికారిక ప్రతినిధి బృందం తలపెట్టిన యూఎస్ పర్యటనకు పలు కారణాల దృష్ట్యా అనుమతి
నిరాకరిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. సీఎం బృందం యూకే, యూఎస్‌ఏ పర్యటనల కోసం విధివిధానాలు, ప్రొటోకాల్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా కేంద్ర అనుమతి కోరింది. కానీ తొలుత లండన్ పర్యటనకు మాత్రమే అనుమతినిచ్చిన విదేశాంగశాఖ.. తర్వాత అమెరికా టూర్‌ను నిరాకరించింది. సీఎం రేవంత్‌రెడ్డి బృందం.. యూకే చేరుకున్న తర్వాత యూఎస్ పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. తెలంగాణ సీఎం ఆఫీస్నుంచి వచ్చిన షెడ్యూల్ ఆయన హోదా, పర్యటన ఉద్దేశానికి భిన్నంగా ఉన్నందునే పర్మిషన్ ఇవ్వలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం ఢిల్లీలో వెల్లడించారు.
యువత భవిష్యత్తుపై సంకుచిత రాజకీయాలా?: సీఎం రేవంత్
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, విద్యారంగ పురోగతికి, ప్రతిష్టాత్మక ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి ఎంతగానో దోహదపడే ఇలాంటి పర్యటనపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించడం తీవ్ర విస్మయాన్ని కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. విద్య, పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణాన్ని సంకుచిత రాజకీయ కోణంలో అడ్డుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం తన అమెరికా పర్యటనను రద్దు చేసుకొని, ఈ నెల 23న లేదంటే 24న లండన్ నుంచి నేరుగా హైదరాబాద్ తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా తన విదేశీ పర్యటన వెనుక ఉన్న అసలు లక్ష్యాన్ని ఆయన వివరించారు.
కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానానికి (ఎన్‌ఈపీ) తగ్గట్టుగా అగ్రశ్రేణి ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలను భారత్‌కు, ప్రత్యేకించి తెలంగాణ గడ్డకు తీసుకురావడమే తమ పర్యటన ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. భావితరాల బంగారు భవిష్యత్తును నిర్మించే ఇలాంటి బృహత్తర కార్యక్రమాల్లో రాజకీయ ద్వేషాలకు తావుండకూడదని కేంద్రానికి హితవు పలికారు. “దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు ముడిపడి ఉన్న అంశాల్లో పార్టీలు, ఎన్నికలు, స్వార్థ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ రైజింగ్ పేరుతో నూతన అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్న వేళ, అడ్డంకులు సృష్టించడం దేశ ప్రయోజనాలకే విఘాతం’’ అని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌ను నాలెడ్డ్ హబ్‌గా తీర్చిదిద్దుతం..
హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. హైదరాబాద్‌కు విద్యా రంగంలో ఘనమైన చరిత్ర ఉందని, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ), జేఎన్‌టీయూ వరకు అనేక ప్రతిష్టాత్మక సంస్థలు నగరంలో ఉన్నాయని గుర్తుచేశారు. పాఠశాల విద్యలో సరికొత్త చరిత్ర సృష్టించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ .. ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు, అగ్రశ్రేణి నాయకులను తీర్చిదిద్ది అంతర్జాతీయంగా సత్తా చాటిందన్నారు. ఐఐటీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), ట్రిపుల్ ఐటీ, నల్సార్‌లాంటి జాతీయస్థాయి సంస్థల రాకతో హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను, టాప్ ఎంఎన్‌సీలను ఆకర్షించగలిగిందని చెప్పారు. వీటికి కొనసాగింపుగా ప్రపంచ ప్రఖ్యాత అంతర్జాతీయ విద్య, నైపుణ్య శిక్షణా సంస్థలకు హైదరాబాద్‌ను ప్రధాన కేంద్రంగా మార్చబోతున్నామని సీఎం వెల్లడించారు.
.ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధులకు సీఎం ఆహ్వానం
తెలంగాణను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్’ పర్యటనలో భాగంగా లండన్ వెళ్లిన సీఎం బృందం.. శుక్రవారం 900 ఏండ్ల చరిత్ర ఉన్న ప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని యూత్, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావాలని వర్సిటీ ప్రతినిధులను సీఎం కోరారు. హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ) కింద ఫారిన్ వర్సిటీలకు ఇండియాలో లభించే అవకాశాలు, తెలంగాణలో ఉన్న సానుకూల పరిస్థితులపై సీఎంవో సలహాదారు కేఆర్ రామకృష్ణారావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బాలియోల్ కాలేజ్ ప్రొఫెసర్ ఫైసల్ దేవ్‌జీతో సీఎం బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్లు మొగ్గు చూపారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’కు రావాలని ఆక్స్‌ఫర్డ్ టీమ్‌ను సీఎం ఆహ్వానించారు. అనంతరం సోమర్‌విల్లే కాలేజీని సందర్శించి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోర్ట్రెయిట్‌ను సీఎం పరిశీలించారు. కాగా, జీఎంఆర్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్‌తో కలిసి ‘యుటిలిటా బౌల్’ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను సీఎం వీక్షించారు. రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూపకల్పనకు పెట్టుబడులు పెట్టాలని జీఎంఆర్‌కు పిలుపునిచ్చారు. లండన్‌లోని ఎమిరేట్స్ స్టేడియంలో ఆర్సెనల్- కోవెంట్రీ మధ్య జరిగే ఈపీఎల్ మ్యాచ్‌ను సీఎం వీక్షించనున్నారు.
ఒప్పందాలు ఆగొద్దు ..
తాను అమెరికా పర్యటనకు వెళ్లలేకపోయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలగకూడదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అమెరికాలోని బోస్టన్ తదితర ప్రాంతాల్లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, గ్లోబల్ సంస్థలతో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలను యథావిధిగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలతో ఇప్పటికే జరిపిన ప్రాథమిక చర్చలను ముందుకు తీసుకెళ్తూ అవసరమైన ఎంవోయూలు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు అధికారుల బృందం అమెరికాలో ఉండి వివిధ విశ్వవిద్యాలయాలతో చర్చలు జరుపుతూ, కార్యాచరణను పూర్తి చేయనున్నది.