Reading Time: 2 minutes
Rajamouli Formula Sukumar Rc17 Tollywood Bollywood Heroines Pan India Trend

Tollywood Directors: టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాల స్థాయి రోజురోజుకూ పెరుగుతోంది. పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న దర్శకనిర్మాతలు.. కథ, హీరోల విషయంలోనే కాకుండా హీరోయిన్ ఎంపికలోనూ కొత్త ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ మార్కెట్‌ను ఆకర్షించేందుకు బాలీవుడ్ భామలను టాలీవుడ్ సినిమాల్లోకి తీసుకురావడంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్‌కు దర్శకధీరుడు రాజమౌళి సినిమాలు ఒకరకంగా బాటలు వేశాయని చెప్పొచ్చు. ‘ఆర్ఆర్ఆర్’లో అలియా భట్‌తో మొదలైన ఈ ట్రెండ్, తర్వాత ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొణె, ‘దేవర’లో జాన్వీ కపూర్ వంటి బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాన్ ఇండియా సినిమాల్లో నార్త్ హీరోయిన్లకు డిమాండ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను పలువురు స్టార్ డైరెక్టర్లు ఫాలో అవుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’లో బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’లో దీపికా పదుకొణె ఇప్పటికే భాగమయ్యారు. ఈ సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘AA23’ విషయంలోనూ బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ నుంచి దీపికా పదుకొణె తప్పుకున్న తర్వాత ఆమె స్థానంలో తృప్తి డిమ్రి ఎంపికైన విషయం తెలిసిందే. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘కల్కి 2’లోనూ బాలీవుడ్ భామను తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో పాన్ ఇండియా సినిమాల్లో నార్త్ హీరోయిన్లకు డిమాండ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థమవుతోంది.

ఇప్పుడు సుకుమార్ కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతారా? అనే చర్చ మొదలైంది. రామ్ చరణ్‌తో సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘RC17’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో శ్రద్ధా కపూర్ పేరు కూడా వినిపించింది. అయితే గతంలో ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధా కపూర్‌ను సంప్రదించగా.. ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే ఆ ప్రయత్నం ముందుకు సాగలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. మొత్తంగా పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు బాలీవుడ్ హీరోయిన్ల వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. మరి రామ్ చరణ్-సుకుమార్ కాంబోలో నార్త్ బ్యూటీనే హీరోయిన్‌గా ఎంపిక చేస్తారా? లేక సౌత్ హీరోయిన్‌తో సరిపెడతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.