Reading Time: 2 minutes

లేడీ సింగంపై సస్పెన్షన్ వేటు! ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ ఆఫీసర్గా ఎదిగి చివరికి ఇలా..

Caption of Image.

ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ మెంబర్ గా ఎంతో మందిని దేశ విదేశాలు దాటించిన ఎయిర్ హోస్టెస్.. ఐపీఎస్ ఆఫీసర్ గా కీలక మలుపు తిరిగిన కెరీర్.. తనదైన స్టైల్ లో విధులు నిర్వర్తించి డేరింగ్, డాషింగ్ ఆఫీసర్ గా.. లేడీ సింగంగా పేరుతెచ్చుకున్న ఎస్పీ నేహా పచ్చీసియా సస్పెన్షన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విధుల్లో ఎందరికో ఆదర్శంగా నిలిచి.. ఇప్పుడు అవినీతి ఆరోపణల్లో సస్పెండ్ కావడం దేశ వ్యాప్తంగా విమర్శల పాలు కావస్తోంది. 

ఒక పదేళ్లపాటు పోలీస్ ఫీల్డ్ లో తనదైన ముద్రతో ఫేమస్ అయిన కత్నీ ఎస్పీ నేహా పచీసియా.. క్రిమినల్ కేసు నిందితులకు సహాయం చేస్తూ అవినీతిని ప్రోత్సహించారనే ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. హత్యారోపణలు ఉన్న కుటుంబానికి వంతపాడుతూ.. 83 లక్షల రూపాయల భూమిని 18 లక్షల 20 వేలకే అమ్మేలా బాధితులపై ఒత్తిడి చేసి క్రిమినల్స్ కు ఫేవర్ చేశారనే ఆరోపణలతో సీఎం మోహన్ యాదవ్ ఆమెను సస్పెన్షన్ చేయాల్సిందిగా 2026 ఆగస్టు 21న ఆదేశాలిచ్చారు. 

ఆగస్టు 19న ఎస్పీపైన, ఇద్దరు ప్రైవేటు వ్యక్తులపైన కత్నీలోని కుత్లా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైన రెండు రోజులకే సస్పెన్షన్ ఆదేశాలు రావడం గమనార్హం. ఆమెను భోపాల్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఎలాంటి నిష్పక్షపాత వైఖరి లేకుండా దర్యాప్తు జరపాలని.. ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 

ఈ కేసులో రమేష్ లోధికి చెందిన  ఆస్తికి సంబంధించి తప్పుడు విలువను చూపించి క్రిమినల్ ఫ్యామిలీకి లబ్ది చేకూర్చినట్లు ఆరోపణలున్నాయి. పోలీసు విచారణ ప్రకారం, ఆ ఆస్తి విలువ రూ. 82.86 లక్షలు. అయితే, లోధి కుటుంబాన్ని ఒత్తిడి చేసి, ఆ ఆస్తిని కేవలం రూ. 18.20 లక్షలకే మారూఫ్ అహ్మద్ హనఫీకి అమ్మేలా చేశారని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. అంటే, అధికారికంగా దాదాపు రూ. 83 లక్షల విలువైన ఆస్తిని, ఆ విలువలో నాలుగో వంతు కంటే తక్కువ ధరకు అమ్మేటట్లుగా ఒత్తిడి చేసి.. క్రిమినల్స్ కు మేలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఒక కేసులో జైల్లో ఉన్న వ్యక్తి బలహీనతను ఆసరాగా చేసుకుని.. తక్కువ ధరకు అమ్మకుంటే మరింత తీవ్రమైన కేసు నమోదు చేస్తామని బెరించినట్లు ఆరోపణలున్నాయి.  ఈ లావాదేవీని జరిపించడానికి పోలీసు అధికారాన్నే ఉపయోగించుకున్నారనే ఆరోపణలున్నాయి.  

రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం, మొత్తం రూ. 18.20 లక్షలలో రూ. 15 లక్షలు చెక్కు ద్వారా, రూ. 3.20 లక్షలు నగదు రూపంలో చెల్లించారు. కానీ, దర్యాప్తు అధికారులు కొనుగోలుదారు మరూఫ్ అహ్మద్ హనాఫీ ఆర్థిక వివరాలను పరిశీలించినప్పుడు, వారికి ఒక ఆశ్చర్యకరమైన విషయం దొరికినట్లు ఆరోపణలు ఉన్నాయి: జూలై 11, 2025 నాటికి అతని బ్యాంకు ఖాతాలో కేవలం రూ. 3,036 మాత్రమే నిల్వ ఉన్నాయి.

ఆ తర్వాత, ఆస్తి రిజిస్ట్రేషన్ జరిగిన రోజేఅంటే 2026 ఏప్రిల్ 15న—హనఫీ ఖాతాలో హఠాత్తుగా రూ. 15 లక్షలు జమ అయ్యాయి. విచారణ అధికారుల వివరాల ప్రకారం, ఇందులో రూ. 10 లక్షలు షైన్ పార్ట్‌నర్స్ (Shine Partners) అనే సంస్థ నుండి రాగా, మిగిలిన రూ. 5 లక్షలు క్షితిజ్ రాజ్ బరాపత్రే ఖాతా నుండి ట్రాన్స్ ఫర్ అయ్యాయి.   షైన్ పార్ట్‌నర్స్, బరాపత్రేల బ్యాంక్ ఖాతాలు ఒకే పాన్ (PAN) నంబర్‌కు లింక్ అయ్యి ఉన్నాయి.  

భోపాల్ విజిలెన్స్ విభాగం ఫిర్యాదు, జబల్‌పూర్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రమోద్ వర్మ ఆదేశాల మేరకు  ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ముందు, ఐపీఎస్ అధికారి అను బెనివాల్ నేతృత్వంలో ఈ భూమి లావాదేవీ, దానికి సంబంధించిన ఆరోపణలపై విచారణ జరిగింది.

ఈ కేసులో తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని కట్నీ జిల్లా ఎస్పీ అభినయ్ విశ్వకర్మ కన్ఫామ్ చేశారు. మోసం, బలవంతం, నేరపూరిత కుట్ర వంటి అభియోగాలపై సీఎస్‌పీ (CSP) మరియు ఇతర నిందితులపై కేసు నమోదు చేసినట్లు అని ఆయన తెలిపారు.
 

©️ VIL Media Pvt Ltd.