Reading Time: < 1 minute

El Nino: వందేళ్లలో అత్యంత బలమైన ఎల్ నినో .. భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. మన దేశంపై తీవ్రప్రభావం!

Caption of Image.
  • ఎల్‌నినోతో పెను ముప్పు.. 
  • 2027లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు?

పసిఫిక్‌లో పుట్టుకొస్తున్న బలమైన ఎల్‌నినో ప్రపంచాన్ని మరింత వేడెక్కించే ప్రమాదం ఉందని యూకే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో 2027 రికార్డు స్థాయిలో అత్యంత వేడి సంవత్సరంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. భారత్‌లోనూ రుతుపవనాలు, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై దీని ప్రభావం పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్‌నినో ప్రభావం ప్రపంచంపై తీవ్రంగా పడే అవకాశం ఉందని యూకే వాతావరణ శాఖ(MET) హెచ్చరించింది. ఇది చాలా అరుదైన, బలమైన ఎల్‌నినోగా మారే అవకాశం ఉందని తెలిపింది. 2027లో ప్రపంచ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఎల్‌నినో అంటే భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ సముద్ర జలాలు సాధారణం కంటే వేడెక్కే వాతావరణ పరిస్థితి. సాధారణంగా ఇది కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది. దీని ప్రభావం ప్రపంచంలోని అనేక ప్రాంతాల వాతావరణంపై కనిపిస్తుంది.

 ప్రస్తుత ఎల్‌నినో మరింత బలపడితే ప్రపంచ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని యూకే వాతావరణ శాఖ (మెట్) అంచనా వేసింది. 2027 అత్యంత వేడి సంవత్సరాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని చెబుతోంది. అయితే ఇది ఇప్పటికీ వాతావరణ నమూనాల ఆధారంగా చేసిన అంచనా మాత్రమే. పరిస్థితులు మారే అవకాశం కూడా ఉందని తెలిపింది. 

భారత్‌పై ఎలాంటి ప్రభావం?

ఎల్‌నినో ప్రభావం మన దేశ నైరుతి రుతుపవనాలపై పడే అవకాశం ఉంది. వర్షపాతం తగ్గడం, కొన్ని ప్రాంతాల్లో వేడి పెరగడం వంటి పరిస్థితులు ఏర్పడొచ్చు. దీంతో వ్యవసాయం, నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే భారత్‌లో రుతుపవనాలపై ఎల్‌నినోతో పాటు ఇతర సముద్ర, వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయి.

వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో బలమైన ఎల్‌నినో ఈ వేడిని మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.