Reading Time: < 1 minute
Telangana Revenue Officials Suspension Tahsildar Mro Show Cause Notice

Ponguleti Srinivas : జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ , గృహ నిర్మాణ శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నాయకత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కలెక్టర్లు, ఆర్‌డీవోలు, ఎమ్మార్వోలు పాల్గొన్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి ఆగ్రహం.. సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులు

ప్రజా సమస్యల పరిష్కారంలో , అధికారుల పనితీరులో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. విధుల్లో తీవ్ర అలసత్వం వహించిన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట తాసిల్దార్ సుజాతను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే సమీక్షా సమావేశంలో ప్రాజెక్టులపై సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాయికల్ ఎమ్మార్వోకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ధరణి పోర్టల్ నిర్వహణలో గతంలో జరిగిన అవకతవకలపై , విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై ఎలాంటి సిఫార్సులు చూడకుండా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి పథకాలపై కీలక ప్రకటనలు

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన బకాయిలన్నింటినీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెల్లిస్తుందని, ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో ఎలాంటి రాజకీయ సిఫార్సులకు తావులేదని మంత్రి వెల్లడించారు. కాగితాలకే పరిమితం కాకుండా ఇప్పటికే రెండు విడతల్లో 8 లక్షల ఇళ్లను ప్రజలకు అందించామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ ధరణి నియామకాలతో ప్రజలు పడిన ఇబ్బందులను తొలగించి, భూముల సమస్యలను సులభతరం చేసేందుకు ‘భూ భారతి’ విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. అయితే, గత పాలకులు భూ భారతిని కూడా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని, దీనిపై ప్రత్యేక విచారణ కోసం ‘సిట్’ (SIT) ఏర్పాటు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.