కావలసిన పదార్థాలు: 300 గ్రాముల లేత బీరకాయలు, అర కప్పు కందిపప్పు, పచ్చి అర కప్పు కొబ్బరి ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక టీస్పూన్జీ లకర్ర, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, 10-12 ఎండుమిర్చి, అంగుళం ముక్క దాల్చిన చెక్క, మూడు లవంగాలు, రెండు యాలకులు, ఒక టీస్పూన్ గసగసాలు, చింతపండు రసం, ఒకటి నుండి రెండు స్పూన్లు బెల్లం తురుము, రెండు స్పూన్లు పల్లీలు, ఆవాలు, మెంతులు, ఇంగువ, కరివేపాకు, పసుపు, ఉప్పు, నూనె లేదా నెయ్యి, కొత్తిమీర.
తయారీ విధానం: ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో పసుపు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించి మెదుపుకోవాలి. అలాగే లేత బీరకాయలపై ఉండే పీచు చెక్కును తీసి మీడియం సైజు ముక్కలుగా కోసి, గిన్నెలో నీళ్లు పోసి 80 శాతం వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి చెంచా నూనె వేసి మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చెక్క, లవంగాలు, యాలకులు మరియు గసగసాలు వేసి చిన్న మంటపై సువాసన వచ్చేలా వేయించాలి. చివరిగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసి కాస్త వేపి, చల్లారాక మిక్సీలో తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. మరొక వెడల్పాటి పాత్రలో చెంచా నూనె వేసి చిటికెడు మెంతులు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి.
ఆ తర్వాత చింతపండు రసం, రుచికి సరిపడా ఉప్పు, బెల్లం తురుము మరియు తగినన్ని నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. పులుపు మరిగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, కందిపప్పు పేస్ట్ మరియు మనం రుబ్బి ఉంచుకున్న కొబ్బరి మసాలా పేస్ట్‌ను ఇందులో వేసి బాగా కలపాలి. మంటను చిన్నగా ఉంచి పప్పును కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు మరిగించాలి.
ఇలా నిదానంగా ఉడకడం వల్లే మసాలాలు, బీరకాయ ముక్కలకు పట్టి పప్పు చిక్కగా మారుతుంది. చివరగా చిన్న పాన్‌లో నెయ్యి లేదా నూనె వేసి పల్లీలు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఈ తాలింపును మరుగుతున్న పప్పులో వేసి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయాలి. అంతే, ఎంతో ఘుమఘుమలాడే ఉడుపి బీరకాయ పప్పు సిద్ధం! వేడి అన్నంలో నెయ్యితో కలిపి సర్వ్ చేసుకుంటే అద్భుతమైన రుచినిస్తుంది.




