పల్లీలను ఉడకబెట్టి తినడం మంచిదా? లేక వేయించి తినడం మంచిదా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. పోషకాహార నిపుణుల ప్రకారం.. వేయించిన పల్లీల కంటే ఉడకబెట్టిన పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. వేరుశనగలను ఉడకబెట్టినప్పుడు వాటిలో ఉండే పాలీఫెనాల్స్ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు దాదాపు 4 రెట్లు పెరుగుతాయి. ఇవి శరీర కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడమే కాకుండా, దీర్ఘకాలిక గుండె జబ్బులు, షుగర్ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి.
మరోవైపు బరువు తగ్గాలనుకునే వారికి ఉడకబెట్టిన పల్లీలు సరైన ఎంపిక. వీటిలో కేలరీలు, కొవ్వు శాతం తక్కువగా ఉండి.. ఫైబర్, తేమ శాతం ఎక్కువగా ఉంటాయి. ఉడకబెట్టిన పల్లీలను మితంగా తీసుకున్నా కడుపు నిండిన అనుభూతినిచ్చి ఎక్కువ సమయం ఆకలి వేయకుండా చేస్తాయి. దీనివల్ల మధ్యమధ్యలో అనవసరమైన జంక్ ఫుడ్స్ తినే అలవాటు తగ్గి సులభంగా జీర్ణమవుతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా ఉప్పు కలపకుండా వీటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
ఇక వేయించిన పల్లీల విషయానికొస్తే.. అధిక ఉష్ణోగ్రత వద్ద వేయించడం వల్ల వాటిలోని కొన్ని కీలక పోషకాలు దెబ్బతింటాయి. అంతేకాకుండా మార్కెట్లో దొరికే వేయించిన పల్లీలలో నూనె, అధిక ఉప్పు కలుపుతారు. ఇది బీపీ పెరగడానికి కారణమవుతుంది. ఒకవేళ వేయించినవి తినాలనుకుంటే.. నూనె, ఉప్పు లేకుండా ఇంట్లోనే తక్కువ మంటపై డ్రై రోస్ట్ చేసుకుని స్వల్ప మోతాదులో మాత్రమే తినడం మంచిది.
పల్లీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, వీటిని ఎప్పుడూ మితంగానే తీసుకోవాలి. అధిక పరిమాణంలో తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే సరిగ్గా నిల్వ చేయని వేరుశనగ గింజలపై తేమ కారణంగా అఫ్లాటాక్సిన్ అనే హానికరమైన ఫంగస్ ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి పాడైపోయిన, వాసన లేదా రుచి మారిన గింజలను ఎట్టిపరిస్థితుల్లోనూ తినకూడదు.
మొత్తంగా చూస్తే.. సంపూర్ణ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు దక్కాలంటే ఉడకబెట్టిన పల్లీలు ఉత్తమ ఎంపిక. ఉప్పు, నూనె జోడించకుండా సహజంగా ఉడకబెట్టిన పల్లీలను రోజూ సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి అసలైన పోషక బలం లభిస్తుంది.




