
- 5.25 ఎకరాలకు ఆన్లైన్లో వేలం పెట్టిన టీజీఐఐసీ
- రూ.1,386 కోట్లకు దక్కించుకున్న ఎంఎస్ఎన్ రియాల్టీ
- మే నెలలో నిర్వహించిన వేలంలో ఎకరం రూ.237 కోట్లు
హైదరాబాద్, వెలుగు: రాయదుర్గం భూములకు అంతకంతకూ డిమాండ్ భారీగా పెరిగిపోతున్నది. ఒకసారి రికార్డ్ ధర అనుకునేలోపే.. రెండు మూడు నెలల్లోనే ఆ రికార్డు బ్రేక్ అయిపోతున్నది. తాజాగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూములకు నిర్వహించిన వేలంలో ఎకరం ధర రూ.264 కోట్లు పలికింది. మేలో నిర్వహించిన వేలంలో పలికిన రికార్డు ధర రూ.237 కోట్లను బ్రేక్ చేసింది.
సర్వే నెంబర్ 83/1లోని ప్లాట్ నంబర్ పీ1లో ఉన్న 5.25 ఎకరాల భూమికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ) శుక్రవారం వేలం నిర్వహించింది. కనీస ధరగా ఎకరానికి రూ.175 కోట్లుగా నిర్ణయించింది. పోటాపోటీగా సాగిన వేలంలో ఎంఎస్ఎన్ రియాల్టీ అనే సంస్థ భూమిని దక్కించుకుంది. ఎకరానికి రూ.264 కోట్లు పాడింది. మొత్తంగా 5.25 ఎకరాల భూమిని ఆ సంస్థే దక్కించుకోగా.. టీజీఐఐసీకి రూ.1,386 కోట్ల ఆదాయం సమకూరింది.
ఇది రిజర్వ్ ధర కన్నా 51 శాతం అధికం కావడం విశేషం. గత రికార్డును కేవలం మూడు నెలల్లోనే బ్రేక్ చేస్తూ ఇప్పుడు వేలంలో అధిక ధర పలకడం.. హైదరాబాద్‌పై ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, జాతీయ స్థాయి డెవలపర్ల విశ్వాసం ఎంతగా పెరిగిందో స్పష్టమవుతోందని అధికారులు అంటున్నారు. రాయదుర్గంలో భూముల విలువ వేగంగా పెరుగుతున్నదనడానికి ఈ వేలం మరో ఉదాహరణగా నిలిచిందన్నారు.
కాగా, ఎంఎస్‌టీసీ ఈ-ఆక్షన్ వేదిక ద్వారా పూర్తి పారదర్శకంగా వేలం నిర్వహించారు. ప్రముఖ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్ ప్రత్యేక ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా వ్యవహరించింది. వేలం అనంతరం టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ.. పీ1 ప్లాట్ వేలం విజయవంతం కావడం తెలంగాణ భవిష్యత్తుపై డెవలపర్‌లకున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
ఇది కేవలం భూమికి మంచి ధర రావడం మాత్రమే కాదని, పారదర్శకత, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్న తెలంగాణ అభివృద్ధి విధానానికి లభించిన గుర్తింపు అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి వ్యాపార, పెట్టుబడుల కేంద్రంగా వేగంగా ఎదుగుతున్నదని ఈ వేలం మరోసారి నిరూపించిందన్నారు. ఈ విజయానికి సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వమే కారణమన్నారు.