Reading Time: < 1 minute
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను కొట్టిచంపిన అత్తింటివారు.. అల్లుడు మృతి

ఢిల్లీ, ఆగస్ట్‌ 22: కుటుంబ గొడవల నేపథ్యంలో అత్తింటి వారు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను కొట్టి చంపారు. భార్య కుటుంబ సభ్యులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఔటర్‌ ఢిల్లీలోని లక్ష్మీ పార్కు ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..

ఔటర్‌ ఢిల్లీలోని లక్ష్మీ పార్కు ప్రాంతంలో నివాసం ఉంటున్న వినయ్‌ గుప్తా (31)కు మూడేళ్ల క్రితం వివాహమైంది. వినయ్‌ మల్టీనేషనల్‌ కంపెనీలో సాఫ్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు నెలల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. శుక్రవారం ఉదయం భార్యాభర్తల మధ్య కుటుంబ విషయానికి సంబంధించి వివాదం తలెత్తింది. దీంతో భార్య తన పుట్టింటివారికి ఫోన్‌ చేసి వారిని ఇంటికి పిలిపించింది. వారు అక్కడికి చేరుకున్న తర్వాత ఇరువర్గాల మధ్య చర్చ జరగగా.. మాటామాటా పెరిగి వివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో వినయ్‌పై భార్య కుటుంబ సభ్యులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వినయ్‌ మృతి చెందాడు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. వినయ్‌ మృతికి దారితీసిన పరిస్థితులు, దాడిలో పాల్గొన్న వారి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కుటుంబ వివాదం చివరకు హింసాత్మక ఘటనగా మారి ఒకరి ప్రాణాలను బలితీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు రెండు వర్గాల నుంచి వివరాలు సేకరించి ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెలుగులోకి రానున్నాయి. నెలల వయసున్న కవల పిల్లలు ఉన్న కుటుంబంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ వివాదం చివరకు ప్రాణాలు తీసే స్థాయికి చేరడంతో విషాదం నెలకొంది.