Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi Out For 8 On Duleep Trophy 2026 Debut

Vaibhav Sooryavanshi Duleep Trophy 2026 Debut: రెడ్‌బాల్ క్రికెట్‌లో భారత సంచలనం వైభవ్ సూర్యవంశీకి తీవ్ర నిరాశ ఎదురైంది. దులీప్ ట్రోఫీ 2026 క్వార్టర్ ఫైనల్లో సింగిల్ డిజిట్‌కే బుడ్డోడు పెవిలియన్ చేరాడు. ఈస్ట్ జోన్ తరఫున తన తొలి దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్న వైభవ్.. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 8 పరుగులకే అవుట్ అయ్యాడు. రెడ్‌బాల్ క్రికెట్‌లో తనను తాను నిరూపించుకునే అవకాశం వచ్చినప్పటికీ.. బుడ్డోడు నిరాశ పరిచాడు.

బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 2 వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ జోన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో ఈస్ట్ జోన్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ ఆరంభంలో వైభవ్ దూకుడుగా ఆడాడు. రెండో ఓవర్‌లో బౌలర్ బిశ్వర్జిత్ కొంతౌజామ్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాది మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. దీంతో 15 ఏళ్ల వైభవ్ 6 బంతుల్లో 8 పరుగులకే తన తొలి దులీప్ ట్రోఫీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఈ మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐపీఎల్‌ 2026, భారత్ తరఫున మెరుపు బ్యాటింగ్‌తో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న బుడ్డోడు.. రెడ్‌బాల్ క్రికెట్‌లో ఎలా ఆడతాడన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఈ టోర్నీలో ఈస్ట్ జోన్‌కు నాయకత్వ బాధ్యతలు కూడా చేపట్టాడు. అయితే తొలి మ్యాచ్‌లోనే 8 పరుగులకు ఔటవడం అతడికి నిరాశ కలిగించే అంశంగా మారింది. వైభవ్ ఔటైన తర్వాత ఈస్ట్ జోన్ మరో వికెట్ కూడా కోల్పోయింది. వైభవ్ సింగిల్ డిజిట్‌కే అవుట్ అవ్వడంతో ఫాన్స్ కూడా నిరాశ వ్యక్తం చేశారు. మరో క్వార్టర్ ఫైనల్‌లో నార్త్ జోన్, వెస్ట్ జోన్ మధ్య మ్యాచ్ కూడా కొనసాగుతోంది.

దులీప్ ట్రోఫీ వంటి ప్రతిష్ఠాత్మక దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీ యువ ఆటగాళ్లకు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే గొప్ప వేదిక. తొలి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ విఫలమైనప్పటికీ.. టోర్నీలో అతడికి ఇంకా అవకాశాలు లభిస్తే రెడ్‌బాల్ క్రికెట్‌కు తనను తాను ఎలా మార్చుకుంటాడన్నది చూడాలి.