Reading Time: 2 minutes

అమెజాన్ ప్రైమ్ బిగ్ మిస్టేక్.. థియేట్రికల్ రిలీజ్ ముందే ఓటీటీలోకి వచ్చేసిన ‘మ్యూటినీ’!

Caption of Image.

హాలీవుడ్ యాక్షన్ కింగ్ జేసన్ స్టాథమ్ లేటెస్ట్ చిత్రం ‘మ్యూటినీ’ (Mutiny) థియేటర్లలోకి రాకముందే ఓటీటీలో ప్రత్యక్షమై అందరికి షాక్ ఇచ్చింది. లయన్స్ గేట్ నిర్మించిన ఈ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ థ్రిల్లర్, డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (US) లో అకస్మాత్తుగా స్ట్రీమ్ అయి ఇంటర్నెట్‌లో విపరీతమైన కలకలం సృష్టించింది. రిలీజ్ కు రెండు రోజుల ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం సినీ వర్గాలను, ఫ్యాన్స్ ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అటు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావాల్సిన ఈ సినిమాను, బుధవారం ( ఆగస్టు 19, 2026 ) అమెజాన్ వేదికగా పొరపాటున స్ట్రీమింగ్ కావడం సంచలనంగా మారింది. దీంతో బుల్లితెరపై ప్రేక్షకులు ఈ  ‘మ్యూటినీ’ మూవీని ఆస్వాదించారు. ప్రైమ్ సంస్థ ఆ లిస్టింగ్‌ను ‘అన్‌అవైలబుల్’ అని మార్చేలోపే ఈ 95 నిమిషాల యాక్షన్ రైడ్‌ను వేలాది మంది చూసేశారు.

ఈ ఊహించని డిజిటల్ లీక్ తర్వాత, సినిమా ముగింపులో ‘ఏదైనా పోస్ట్-క్రెడిట్ సీన్ ఉందా? సీక్వెల్ లేదా పార్ట్-2 కి సంబంధించిన హింట్ ఇచ్చారా?’ అంటూ సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. అయితే అందులో ఎలాంటి పోస్ట్-క్రెడిట్స్, మిడ్-క్రెడిట్స్ సీన్లు లేవు. దర్శకుడు జీన్-ఫ్రాంకోయిస్ రిచెట్ మార్క్ శైలికి తగ్గట్టుగానే ఈ సినిమా మొదటి సెకను నుండి చివరి నిమిషం వరకు కథ పక్కా స్ట్రెయిట్ యాక్షన్ మోడ్‌లోనే సాగుతుంది.

కథలో అసలైన కిక్ ఏంటంటే.. ఇందులో జేసన్ స్టాథమ్ మాజీ స్పెషల్ ఫోర్స్ ఏజెంట్ ‘కోల్ రీడ్’గా కనిపిస్తాడు. తన కళ్ల ముందే ఒక బిలియనీర్ ఇండస్ట్రియలిస్ట్ బాస్ దారుణంగా హత్యకు గురవుతాడు. అంతటితో ఆగకుండా, ఆ హత్య నేరాన్నంతా కోల్ రీడ్ తలపైనే వేస్తారు. ఒకవైపు పోలీసుల వేట, మరోవైపు ప్రాణాలు కాపాడుకుంటూ తనను ఇరికించిన అంతర్జాతీయ కుట్రదారుల ముఠాను బట్టబయలు చేసేందుకు కోల్ చేసే రక్తసిక్త పోరాటమే ఈ ‘మ్యూటినీ’.

ALSO READ :  రానా రిలీజ్ చేస్తున్న ‘అమీర్ లోగ్’..

ఈ మూవీలో అనాబెల్లె వాలిస్, జేసన్ వోంగ్, అర్నాస్ ఫెదరావిసియస్, బెన్ కార్ట్‌రైట్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఓటీటీ లీక్ వివాదం ఎంత రచ్చ చేసినా.. పెద్ద తెరపై జేసన్ స్టాథమ్ ఇచ్చే విద్వంసకర యాక్షన్ ధమాకాను అనుభవించడానికి మాస్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
 

 

©️ VIL Media Pvt Ltd.