Reading Time: < 1 minute
Pawan Kalyan To Visit Kerala For Special Ayurvedic Therapy

Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. రేపు అనగా శనివారం కేరళకు వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి రొటేటర్ కఫ్ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన.. వైద్యుల సూచన మేరకు తదుపరి చికిత్సలో భాగంగా కేరళలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు పవన్ కల్యాణ్‌కు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొంతకాలం బహిరంగ కార్యక్రమాలకు, అధికారిక విధులకు దూరంగా ఉండాలని కూడా వైద్యులు సూచించినట్లు జనసేన కేంద్ర కార్యాలయం తెలిపింది. అయితే పాలనా బాధ్యతల నేపథ్యంలో ఆయన వారం రోజుల్లోనే క్యాంపు కార్యాలయానికి అందుబాటులోకి వచ్చారు.

ఆ తర్వాత ముందుగా ఖరారైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు వరుసగా శాఖాపరమైన సమీక్షలు, పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో శస్త్రచికిత్స చేసిన కుడి భుజం ప్రాంతంలో వాపు పెరగడంతో పాటు తీవ్రమైన జ్వరం కూడా వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు భుజం పూర్తిస్థాయిలో కోలుకునేలా చికిత్స తీసుకోవాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే కేరళలోని ఆయుర్వేద వైద్యాలయంలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స, విశ్రాంతికి ప్రాధాన్యత ఇస్తూనే తన పాలనా బాధ్యతలను కొనసాగించేందుకు పవన్ కల్యాణ్‌ ప్రయత్నిస్తున్నట్లు జనసేన కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.