Reading Time: 2 minutes
Vijay Thalapathy: ఓటీటీలోకి విజయ్ చివరి చిత్రం.. జన నాయగన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

విజయ్ దళపతి నటించిన చివరి సినిమా జన నాయగన్. ఎన్నోసార్లు వాయిదా పడిన అనంతరం ఇటీవల అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఆగ‌స్టు 21న జీ5 ఓటీటీలో ప్రీమియర్ కానుంది. ఇది తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. దీంతో దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన భాషల ప్రేక్షకులను ఈ ప్రతిష్ఠాత్మక సినిమా అలరించనుంది. ‘జననాయకుడు’ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాగానే కాకుండా విజయ్ సినీ ప్రయాణంలో ఓ కీలకమైన మైలురాయిగా నిలిచింది. ఆయ‌న రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత విడుదలవుతున్న ఆయన తొలి చిత్రం ఇదే. కాగా వెండితెరపై ఆయన నటించిన చివరి చిత్రంగానూ ప్రత్యేకతను సంతరించుకుంది. కోట్లాది మంది అభిమానులకు ఈ సినిమా తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన తారల్లో ఒకరైన విజయ్‌కు భావోద్వేగపూరిత వీడ్కోలుగా నిలిచింది. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్‌ తన సినీ ప్రయాణానికి ముగింపు పలుకుతూ.. తన చివరి ఫీచర్‌ ఫిల్మ్‌లో వెండితెరపై చివరిసారిగా కనిపించారు.

హెచ్. వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జననాయకుడు’.. సినిమా అవినీతి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే నిజాయ‌తీ గల మాజీ పోలీస్‌ అధికారి వెట్రి కొండన్‌ చుట్టూ కథ తిరుగుతుంది. శక్తివంతమైన వ్యక్తులు, వ్యవస్థలతో అతను పెద్ద పోరాటంలోకి అడుగుపెట్టిన క్రమంలో.. వెట్రి ప్రజల కోసం పోరాడే నాయకుడిగా ఎదుగుతూ, వారి ఆశ‌ల‌కు, నాయకత్వానికి ప్రతీకగా నిలుస్తాడు. హై-ఆక్టేన్‌ యాక్షన్ స‌న్నివేశాల‌తో పాటు భావోద్వేగాలు, కుటుంబ సంబంధాలు, సామాజిక, రాజకీయ అంశాలను మేళవిస్తూ తెరకెక్కిన ఈ చిత్రంలో బాబీ డియోల్‌, పూజా హెగ్డే, మమిత బైజు, ప్రకాశ్‌ రాజ్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, ప్రియమణి, నాజర్‌, నరైన్‌ తదితరులు ఇత‌ర‌ కీలక పాత్రల్లో నటించారు.

అభిమానులను అలరించే ఎన్నో ఫేవరెట్‌ మూమెంట్స్‌, ఐకానిక్‌ మేనరిజమ్స్‌, స్టార్‌కు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన సిగ్నేచర్‌ ఆన్‌స్క్రీన్‌ ఎలిమెంట్స్‌తో ‘జననాయకుడు’ సినిమా రూపొందింది. తరతరాలుగా కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకున్న ఆయన ప్రత్యేకమైన స్క్రీన్‌ ప్రెజెన్స్‌, చరిష్మా, వారసత్వాన్ని గుర్తుచేస్తూ ఈ చిత్రం ఓ నోస్టాల్జిక్‌ సెలబ్రేషన్‌ను అందించనుంది. తప్పును ప్రశ్నిస్తూ, న్యాయం కోసం నిలబడే ఓ సామాన్యుడి కథగా తెరకెక్కిన ‘జననాయకుడు’.. హై ఎనర్జీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే కాకుండా, భావోద్వేగపూరితమైన వీడ్కోలు చిత్రంగా కూడా ప్రత్యేకతను సంతరించుకుంది.

ఎక్కువమంది చదివినవి : Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

ఎక్కువమంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది..