Reading Time: < 1 minute
Gachibowli Building Collapse Hydraa Illegal Constructions

Ranganath: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో నాలాను ఆనుకుని కేవలం 50 గజాల చిన్న స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణంలో ఉన్న భవనం కూలి పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడటంతో దాదాపు 10 ఫ్లాట్ల వరకు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహబత్, ఉమేష్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ భవనంలో టైల్స్ పనులు చేయడానికి వచ్చిన కార్మికులుగా పోలీసులు భావిస్తున్నారు. భవనం కూలిన ప్రదేశంలో శిథిలాల కింద మరికొందరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా (HYDRAA), డిజాస్టర్ రెస్క్యూ టీమ్‌లు, పోలీసులు వేగంగా సహాయక చర్యలు చేపట్టి శిథిలాలను తొలగిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు సమీపంలోని హాస్టల్ విద్యార్థులు, అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర భయాందోళనలకు గురై ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు తీశారు.

అయితే.. తాజాగా ఘటనాస్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో ఈ చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలను మొత్తం కూల్చేస్తామని హెచ్చరించారు. “సాజిద్ అనే బిల్డర్ హాస్టల్స్ నిర్మాణం చేస్తున్నాడు. అతడు చేసే నిర్మాణాలు ప్రతిసారి ఇలానే ఉంటాయని మేము వింటున్నాం. అతడి సంగతి కూడా చూస్తాం..” అని రంగనాథ్ తెలిపారు. మరోవైపు.. మున్సిపల్ కమిషనర్ సృజన మాట్లాడుతూ.. గతంలోనే ఈ నిర్మాణాలపై మాకు ఫిర్యాదులు వచ్చాయని స్పష్టం చేశారు. నాలుగు నెలల క్రితమే ఈ నిర్మాణాలను ఆపి సీజ్ చేశామని, మళ్ళీ నిన్న వర్క్ స్టార్ట్ చేసినట్లు వెల్లడించారు. నాలాను ఆక్రమించి నిర్మాణలు ఉన్నాయని తెలిపారు. ఈ బిల్డింగ్ చుట్టూ చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, హాస్టల్ బిల్డింగ్ నిర్మాణంలో ఉందన్నారు. 7+పెంట్ హౌజ్ కోసం నిర్మాణం చేస్తున్నాడని వివరించారు.