Reading Time: 2 minutes

ఎల్‌‌‌‌‌‌‌‌నినోను ఎదుర్కొనేందుకు పకడ్బందీ వ్యూహం.. భూగర్భజలాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం

Caption of Image.
  • మంత్రులు సీతక్క, తుమ్మల, వాకిటి శ్రీహరి 
  • సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో మరింత అప్రమత్తంగా ఉండాలి: సీఎస్ సంజయ్ జాజు
  • రాజేంద్రనగర్ టీజీఐఆర్‌‌‌‌‌‌‌‌డీలో ‘ఎల్‌‌‌‌‌‌‌‌నినో నివారణ’పై రాష్ట్రస్థాయి వర్క్‌‌‌‌‌‌‌‌షాప్
  • దేశంలోనే తొలిసారి ప్రతి పంచాయతీకి ప్రత్యేక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో  ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే ముప్పు ఉందని, గ్రామీణ ప్రాంతాలు, రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ వ్యూహం రూపొందించిందని మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఎల్‌‌‌‌‌‌‌‌నినోను విపత్తుగానే చూడకుండా పక్కా ప్రణాళికతో అవకాశంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. 

శుక్రవారం రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ(టీజీఐఆర్డీ)లో ‘ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావం– ప్రభుత్వ శాఖల ముందస్తు కార్యాచరణ’పై రాష్ట్రస్థాయి వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌ జరిగింది. మంత్రులతో పాటు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌‌‌‌‌‌‌‌ జాజు, పంచాయతీరాజ్ స్పెషల్‌‌‌‌‌‌‌‌ సీఎస్‌‌‌‌‌‌‌‌ దానకిశోర్‌‌‌‌‌‌‌‌, పీఆర్ కమిషనర్ దివ్య దేవరాజన్, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, పశుసంవర్ధకశాఖ కార్యదర్శి ఇలంబర్తి, టీజీఐఆర్‌‌‌‌‌‌‌‌డీ సీఈవో నిఖిల, ఉద్యాన డైరెక్టర్ యాస్మిన్ బాషా, వేర్‌‌‌‌‌‌‌‌హౌసింగ్ ఎండీ కొర్ర లక్ష్మి, అదనపు కలెక్టర్లు, డీఆర్డీవోలు, డీపీవోలు, జిల్లాల సీఈవోలు హాజరయ్యారు.  

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ను మంత్రులు, సీఎస్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా గ్రామీణ ప్రజలను ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలన్నారు.

 పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(జీపీఎస్​ఏపీ)  కాగితాలకే పరిమితం కాకూడదని,  రాబోయే 5 నుంచి 10 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రామసభల ద్వారానే పనులను ఎంపిక చేయాలన్నారు.  ‘వీబీ–జీ రామ్ జీ’ నిధులను ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తూ నీటి సంరక్షణ పనులకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలని కోరారు. 

30 లక్షల బోర్లను కాపాడుకోవడమే లక్ష్యం :  మంత్రి తుమ్మల

రాష్ట్రంలో ప్రాజెక్టులు ఉన్నప్పటికీ సుమారు 30 లక్షల బోర్లు కింద వ్యవసాయం సాగుతోందని, వాటిని కాపాడుకోవడమే లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.  ప్రతి పంటకూ నీటి కుంట, ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, ఊరికో ఊట చెరువు నిర్మించాలని పిలుపునిచ్చారు. 

వీటి ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని,  ఇప్పటికే లక్ష ఎకరాలకు పామాయిల్ సాగును విస్తరించామని, ఏటా 2 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మంత్రి శ్రీహరి మాట్లాడుతూ వర్షపు నీటిని నిల్వ చేసి చేపల పెంపకానికి ప్రోత్సహిస్తున్నామన్నారు. 

పశువులు, గొర్రెలు, మేకల మేత కోసం ప్రత్యేక ప్రాంతాలను గుర్తించి పశుగ్రాస కొరత రాకుండా చూడాలని కోరారు.  ఎంపీ వేం నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధి నిధులతో కేవలం రోడ్లు, డ్రైనేజీలే కాకుండా గ్రామానికి శాశ్వత ఆస్తులను సృష్టించాలన్నారు. టార్గెట్లు పూర్తి చేయాలనే ఆరాటంలో అవసరం లేని పనులు చేపట్టవద్దని,  ప్రతి పనికీ జియో ట్యాగింగ్ చేయాలని,  ప్రజలకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూర్చే నీటి నిల్వ పనులకే నిధులు వెచ్చించాలన్నారు.  

సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే విస్తృతంగా వరి నాట్లు పడ్డాయని, ఇంకా 20 లక్షల ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉందని,  సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో వర్షాభావ పరిస్థితులు తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.