
- జగిత్యాలలో రూ.11.80 కోట్లతో ఆరు కొత్త ప్రభుత్వ కార్యాలయాలకు శంకుస్థాపన
- నూకపల్లి 2బీహెచ్‌కే కాలనీ అభివృద్ధికి రూ.72 కోట్లు
- ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వే పూర్తి
- నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు రద్దు చేస్తామని వెల్లడి
జగిత్యాల, వెలుగు: ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణంతో ప్రజలకు వేగవంతమైన, మెరుగైన పాలనా సేవలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వే చేపడుతున్నామని, ఏడాదిన్నరలోగా ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంప్‌లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి మంత్రి పొంగులేటి ఆరు కొత్త ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.11.80 కోట్ల అంచనా వ్యయంతో ఈ భవనాలను నిర్మించనున్నారు. జగిత్యాల, మెట్‌పల్లి ఆర్డీవో కార్యాలయాలకు రూ.2.25 కోట్లు, భీమారం, ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయాలకు రూ.2.25 కోట్లు, మాల్యాల, మెట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రూ.1.40 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు.
నూకపల్లి కాలనీకి రూ.72 కోట్లు
నూకపల్లి 2బీహెచ్‌కే గృహ సముదాయాన్ని మంత్రులు సందర్శించారు. లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం కాలనీ వసతులను నిర్లక్ష్యం చేసిందని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి దశలోనే రూ.32 కోట్లతో తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలు కల్పించామని చెప్పారు. మొత్తంగా నూకపల్లి మౌలిక వసతుల కోసం రూ.72 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మరో మూడు నెలల్లో కాలనీలో సెల్‌టవర్, బస్సు సౌకర్యం, రేషన్ దుకాణం అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రీ సర్వేతో భూ సమస్యలకు చెక్
రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వే చేపట్టి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి తెలిపారు. ఏడాదిన్నరలోగా రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అర్హులైన రైతులందరికీ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తామని, నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
చిన్నారుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
మల్యాల మండలంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం చెక్కులను మంత్రులు అందజేశారు. కోరుట్లలో దివంగత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహానికి మంత్రి పొంగులేటి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేశ్ కుమార్, కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి కృష్ణారావు, మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత, టౌన్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, పన్నాల అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తప్పులు దొర్లితే ఉపేక్షించేది లేదు
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, అవినీతి, విధుల్లో అలసత్వాన్ని సహించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో మంత్రి అడ్లూరితో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాలుగు జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, హౌసింగ్ శాఖల అధికారులతో నాలుగు గంటల పాటు రివ్యూ నిర్వహించారు. భూ రీ-సర్వే, భూ భారతి, 22-ఏ కేసులు, అసైన్డ్ భూములు, ఇందిరమ్మ ఇళ్లపై జిల్లాల వారీగా సమీక్షించారు. విధుల్లో నిర్లక్ష్యం, ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వంపై మంత్రి ఫైర్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ను సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అలసత్వం వహిస్తున్న మరికొందరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. ప్రజలు సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.