
Fauji Movie Action Scenes Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతున్నాయి. ఈ లీక్స్‌తో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ఫౌజీలో ఉండబోయే రెండు భారీ యాక్షన్ బ్లాక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఫౌజీ సినిమాలో ఓ భారీ అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు సమాచారం. ఈ ఫైట్ సీన్‌ను దాదాపు 20 రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ బ్లాక్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనుందని టాక్. సెట్‌కు సంబంధించిన విజువల్స్ కూడా లీక్ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇక రెండో యాక్షన్ బ్లాక్‌ను లార్డ్ నరసింహ స్వామి థీమ్ ఆధారంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అత్యంత పవర్‌ఫుల్‌గా ఉండే ఈ డివోషనల్ యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రభాస్ హై-వోల్టేజ్ యాక్షన్‌తో పాటు ఎమోషన్స్‌తో ఆకట్టుకోనున్నారని సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ఫైట్‌లో ఏకంగా ముగ్గురు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్లు కలిసి పనిచేసినట్లు టాక్.
ఈ రెండు భారీ యాక్షన్ బ్లాక్స్ ఫౌజీ సినిమా సెకండ్ హాఫ్‌లో కీలకంగా ఉండనున్నాయని తెలుస్తోంది. భారీ యాక్షన్, ఎమోషన్, విజువల్ ఎఫెక్ట్స్ కలయికలో ఈ సన్నివేశాలు అభిమానులకు థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటాయని చిత్ర వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ప్రభాస్‌కు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో లీకై వైరల్‌గా మారింది. ఇందులో డార్లింగ్ రెడ్ షర్ట్, బ్లాక్ ప్యాంట్‌తో ఫార్మల్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ‘మిర్చి’ తర్వాత ప్రభాస్‌ను ఇలాంటి ఫార్మల్ లుక్‌లో చూడటం అరుదుగా ఉండటంతో.. ఈ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ‘ఫౌజీ’పై సోషల్ మీడియాలో చర్చ మరింత జోరందుకుంది.
పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్, హను రాఘవపూడి స్టైల్ కథనం, ప్రభాస్ స్టార్‌డమ్‌కు తోడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండటంతో ఫౌజీపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇమాన్వి హీరోయిన్‌గా కనిపించనుండగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ భారీ యాక్షన్ డ్రామాతో ప్రభాస్, హను రాఘవపూడి ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.