
మన చిన్నతనంలో నీళ్ల కోసం కుండలో రాళ్లు వేసి నీటి మట్టాన్ని పెంచిన తెలివైన కాకి కథను వినే ఉంటాం. కాకులు ఎంతో తెలివైన పక్షులని శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. అయితే ఈ వీడియోలోని కాకి ప్రవర్తన చూస్తుంటే, ఆ పాత కథకు ఇదొక ఆధునిక రూపంలా కనిపిస్తోంది. ప్రస్తుతం, సోషల్ మీడియాలో ఒక తెలివైన కాకికి సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా పక్షులు ఆహారాన్ని నేరుగా తింటాయి. కానీ, ఈ కాకి మాత్రం మనుషుల మాదిరిగానే బిస్కెట్‌ను నీటిలో నానబెట్టి తింటూ అందరినీ ఆశ్చర్యపరిచింది.
వీడియోలోని వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి కాకికి తినడానికి ఒక పొడి బిస్కెట్‌ను అందించాడు. గట్టిగా ఉన్న బిస్కెట్‌ను నేరుగా తినడం కష్టమని భావించిందో ఏమో గానీ, ఆ కాకి తన తెలివితెటలను ప్రదర్శించింది. బిస్కెట్‌ను నోటితో పట్టుకుని, పక్కనే ఉన్న ఒక చిన్న నీటి పాత్ర వద్దకు వెళ్లింది. అందులో బిస్కెట్‌ను కొద్దిసేపు ముంచి, అది మెత్తగా మారిన తర్వాత ఎంతో హాయిగా తినింది. ఈ ప్రక్రియను అది ప్రతిసారీ రిపీట్ చేస్తూ బిస్కెట్ మొత్తాన్ని పూర్తి చేసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిన కొద్దిసేపటికే లక్షలాది వీక్షణలను సొంతం చేసుకుంది. కాకి సమయస్ఫూర్తిని, ఉపాయాన్ని చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు. ఈ కాకి మనకంటే చాలా తెలివైంది, చిన్ననాటి తెలివైన కాకి ఇప్పుడు అప్‌డేట్ అయింది అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరొక నెటిజన్ అయితే ముందు జాగ్రత్తగా పక్కన కొద్దిగా టీ కూడా పెడితే బాగుండేది అంటూ వ్యాఖ్యానించారు.
వీడియో ఇక్కడ చూడండి..
పక్షులకు ఉన్న సహజ సిద్ధమైన తెలివితేటలను, సమయానుకూల ఆలోచనా విధానాన్ని ఈ వీడియో స్పష్టంగా చూపుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఈ వీడియో ఇప్పుడు అందరినీ నవ్విస్తూ, ఆలోచింపజేస్తోంది.