
ములుగు/ కొత్తగూడ, వెలుగు: క్రమశిక్షణ, పట్టుదల, ధైర్యంతో క్రీడల్లో విజయం సాధించవచ్చని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శనివారం ములుగు మండలం జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మైదానంలో జిల్లా జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించి, విజేతలకు మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడల్లో రాణించి జీవితంలో స్థిరపడటంతో పాటు తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావచ్చన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, పీడీ వెంకట్ రెడ్డి, అసోసియేట్ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్ రెడ్డి, సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ రాములు మృతి.. మంత్రి పరామర్శ
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి సర్పంచ్ గట్టి రాములు (55) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క గ్రామానికి చేరుకుని రాములు మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు.