Reading Time: < 1 minute
అర్ధరాత్రి ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి! 3 నెలల్లో రెండోసారి..

యాదాద్రి, ఆగస్ట్‌ 22: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని హెజిలో ఫార్మా కంపెనీలో శుక్రవారం రాత్రి భారీ శబ్దంతో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 11 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించారు. రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో రియాక్టర్ పేలడంతో భారీ శబ్దం వినిపించింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూసేసరికి పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతూ కనిపించాయి. దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే రసాయనాలు లీక్ అవుతుండటంతో పొగ భారీగా వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. పరిశ్రమ పరిసరాల్లో ఘాటైన రసాయన వాసన రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రసాయనాల ప్రభావం దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాల వైపు కూడా వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో పదిమందికి పైగా కార్మికులు ఉన్నట్లు తోటి కార్మికులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్యపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

మూడు నెలల్లో రెండో ప్రమాదం

కాగా హెజిలో ఫార్మా కంపెనీలో మూడు నెలల వ్యవధిలోనే రియాక్టర్ పేలడం ఇది రెండోసారి కావడం గమనార్హం. వరుస ప్రమాదాలతో దోతిగూడెం, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అనే అంశంపై అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? రియాక్టర్ పేలడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? రసాయనాల లీకేజీ వల్ల పరిసర ప్రాంతాలపై ఎలాంటి ప్రభావం పడింది? అనే వివరాలు తెలియాల్సి ఉంది.