
మహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువు, భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడికి లోనై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ‘‘వచ్చే జన్మలోనైనా మీ కోసం డాక్టర్ అవుతా’’ అంటూ తల్లిదండ్రులకు భావోద్వేగ లేఖ రాసి అతడు ప్రాణాలు తీసుకున్నాడు.
మృతుడిని సూరజ్ సుభాష్ షిండేగా గుర్తించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో వైజాపూర్ తాలూకా ఖండాలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఎప్పటిలాగే ఇంటి పై అంతస్తులోని గదిలో నీట్‌కు సిద్ధమవుతున్న సూరజ్.. అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
‘‘వచ్చే జన్మలో డాక్టర్ అవుతా’’
ఆత్మహత్యకు ముందు సూరజ్ రెండు వాక్యాలతో కూడిన భావోద్వేగ లేఖను వదిలినట్లు తెలుస్తోంది. ‘‘అమ్మా, నాన్నా.. నన్ను క్షమించండి. వచ్చే జన్మలోనైనా మీ కోసం తప్పకుండా డాక్టర్ అవుతాను. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.. సంతోషంగా ఉండండి’’ అని అందులో రాసినట్లు సమాచారం. చదువు, భవిష్యత్తుపై తీవ్రమైన ఒత్తిడి కారణంగానే సూరజ్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలో అత్యంత పోటీ ఉన్న ప్రవేశ పరీక్షల్లో నీట్ ఒకటి. పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో గతంలో తీవ్ర వివాదం చెలరేగింది. పరీక్ష నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు వ్యక్తం చేశారు. పరీక్షా విధానంలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర విద్యాశాఖ రాధాకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది.
నీట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో డేటా భద్రత, పరీక్షా ప్రక్రియ, మౌలిక వసతులు, సిబ్బంది, సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు కూడా పేర్కొంది. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు కొనసాగిస్తోంది.