
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో 30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రాజంపేట్ ఎస్ఐ ఆంజనేయులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సిమెంట్ దుకాణం విషయంలో సిద్ధిరాములు అనే వ్యక్తి నుంచి ఎస్ఐ ఆంజనేయులు 50 వేల రూపాయలు డిమాండ్ చేశాడు.
ముందుగా సిద్ధిరాములు వద్ద నుంచి 20 వేల రూపాయలు తీసుకున్నాడు. గురువారం మధ్యాహ్నం కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీలోని ఎస్సై నివాసంలో మరో 30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్సై నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. కేసుకు సంబంధించి వివరాలపై ఏసీబీ అధికారులు విచారణ కొనసాగించారు.
హైదరాబాద్ సిటీలో కూడా ఈ తరహాలోనే GHMC టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ లంచం తీసుకుంటూ దొరికిపోయింది. బిల్డింగ్ పర్మిషన్ ఫైల్ ప్రాసెస్ చేసేందుకు లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ప్రభావతి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
ALSO READ : కోట్లకు కోట్లు వెనకేసిన ఇబ్రహీంపట్నం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్..
చాంద్రాయణగుట్ట నర్కి పూల్ బాగ్ జోనల్ కార్యాలయంలో రూ.20 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ నగర్ సర్కిల్–25 పరిధిలో బిల్డింగ్ పర్మిషన్ ఫైల్ ప్రాసెస్ చేసి, బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్, వర్క్ కమాన్స్మెంట్ లెటర్ ఇచ్చేందుకు ప్రభావతి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు.