Reading Time: < 1 minute
Telangana Inter Pass Certificates 2026 Distribution

TS Inter 2026 : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి మార్చి-2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, అలాగే మే-2026 అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల పాస్ సర్టిఫికెట్ల (మెమోల) పంపిణీకి శ్రీకారం చుట్టింది. జనరల్ , ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన విద్యార్థుల పాస్ సర్టిఫికెట్ల ముద్రణ ప్రక్రియను బోర్డు విజయవంతంగా పూర్తి చేసింది. ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ తమ కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించి సర్టిఫికెట్లను స్వీకరించవచ్చని అధికారులు వెల్లడించారు.

25 ప్రత్యేక భద్రతా ఫీచర్లతో ప్రతి సర్టిఫికెట్

ఈసారి విద్యా మండలి పాస్ సర్టిఫికెట్ల ముద్రణలో అత్యాధునిక భద్రతా ప్రమాణాలను పాటించింది. నకిలీ (డూప్లికేషన్) సర్టిఫికెట్ల తయారీకి లేదా ట్యాంపరింగ్‌కు ఎలాంటి అవకాశం లేకుండా ప్రతి పాస్ సర్టిఫికెట్‌లో 25 ప్రత్యేక భద్రతా ఫీచర్లను చేర్చారు. మార్కులు, వివరాల విశ్వసనీయతను, అసలుదనాన్ని కాపాడేందుకు బహుళస్థాయి భద్రతా చర్యలు చేపట్టినట్లు బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్ల ద్వారా పంపిణీ

ముద్రించిన సర్టిఫికెట్లను ఇప్పటికే జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారులు , నోడల్ అధికారులకు అప్పగించారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఈ సర్టిఫికెట్లను సంబంధిత జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు చేరుస్తున్నారు. విద్యార్థులు నేరుగా తమ కాలేజీల వద్దకు వెళ్లి ఒరిజినల్ మెమోలను తీసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. పరీక్షల్లో ప్రతిభ చాటి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసింది.