
భారతదేశమంతటా రక్షాబంధన్ వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. కానీ, కొన్ని గ్రామాల్లో మాత్రం ఈ పండుగను తరతరాలుగా జరుపుకోవడం లేదు. గతాన్ని గుర్తుచేసే విషాదాలు, ద్రోహాలు, హత్యల కారణంగా.. ఆ గ్రామాల ప్రజలు రాఖీ కట్టే సంప్రదాయానికి దూరంగా ఉంటున్నారు. ఆ 7 గ్రామాలు, వాటి వెనుక ఉన్న కథలు ఏంటో చూద్దామా…..
సథా, ధౌలానా (ఉత్తర ప్రదేశ్): ఇక్కడి ప్రజలు మహారాణా ప్రతాప్ వంశస్తులు. రాఖీ పండుగ రోజే జరిగిన ఒక యుద్ధంలో వీరి పూర్వీకులు ఓడిపోయి, పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. ఆ విషాదానికి గుర్తుగా ఇక్కడ రాఖీ పండుగ చేసుకోవడం మానేశారు.
పాలి (రాజస్థాన్): క్రీ.శ. 1230లో రాఖీ పండుగ రోజే పాలివాల్ బ్రాహ్మణులపై మహమ్మద్ ఘోరీ దాడి చేసి దారణంగా చంపేశాడు. అందుకే ఈ రోజును వారు పండుగలా కాకుండా ఒక విషాద దినంగా భావిస్తారు.
బెనిపూర్ చక్ (సంభాల్): దాదాపు 300 ఏళ్ల క్రితం ఒక ఠాకూర్ మహిళ ఇద్దరు యాదవ సోదరులకు రాఖీ కట్టి, కానుకగా వారి కుటుంబ ఆస్తిని అడిగింది. ఆ సోదరులు ఆస్తి రాసిచ్చి గ్రామం వదిలి వెళ్లిపోయారు. అలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదని ఇక్కడ రాఖీలు కట్టరు.
భికంపూర్ జగత్ పూర్వ (గోండా): 1955లో రాఖీ కట్టే క్రమంలో జరిగిన వివాదం ఒక వ్యక్తి హత్యకు దారితీసింది. ఆ తర్వాత కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగడంతో గత 60 ఏళ్లుగా ఇక్కడ సోదరీమణులు రాఖీలు కట్టడం లేదు.
అఘ్యానా (సహారన్‌పూర్): ఇక్కడ మహిళలను వేధిస్తున్న జమాల్ ఖాన్ అనే నిరంకుశ పాలకుడిని గ్రామస్తులు తిరుగుబాటు చేసి చంపేశారు. ఆ హింసాత్మక ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ పండుగకు దూరంగా ఉండిపోయారు.
ALSO READ : రాఖీ పండుగ.. చంద్రగ్రహణం ఒకేరోజు.. రాఖీ కట్టొచ్చా.. కట్టకూడదా..!.
సురానా (ఘజియాబాద్): తారైన్ యుద్ధం తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ వంశస్థులు ఇక్కడ ఉంటున్నారని తెలుసుకున్న మహమ్మద్ ఘోరీ, రాఖీ పండుగ రోజే గ్రామంపై దాడి చేసి ఊచకోత కోశాడు. అందుకే ఇక్కడి ప్రజలకు రాఖి పండుగ అంటే దుఃఖ దినం.
సిమ్రాయ్ (అలీగఢ్): ఒకప్పుడు ఇక్కడ యాదవులు, ఠాకూర్లు సోదరులుగా రాఖీలు కట్టుకునేవారు. కానీ, రాఖీ కానుకలుగా గుర్రాలు, ఆస్తులు అని మితిమీరిన డిమాండ్లు మొదలవడంతో విభేదాలు వచ్చి ఈ ఆచారాన్ని శాశ్వతంగా ఆపేశారు.