
బ్రిటన్‌లో వైద్యులు ఓ భారీ కొండచిలువకు అరుదైన క్యాన్సర్ చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. సాధారణంగా మనుషుల్లో ఉపయోగించే అధునాతన ఎలక్ట్రోకెమోథెరపీ విధానాన్ని పాముకు అనుగుణంగా మార్చి చికిత్స అందించడం ప్రత్యేకతగా నిలిచింది. దవడలో ఏర్పడిన ప్రాణాంతక కణితిని తొలగించడంతో పాటు మిగిలిన క్యాన్సర్ కణాలను నాశనం చేయడంతో 50 కిలోల బరువున్న ఈ కొండచిలువ పూర్తిగా కోలుకుంది.
ఇంగ్లాండ్‌లోని చెస్టర్ జూలో ఉన్న 23 ఏళ్ల రెటిక్యులేటెడ్ పైథాన్ ‘జోడీ ఫోస్టర్’ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. వైద్య పరీక్షలు నిర్వహించగా.. దాని దవడలో ఫైబ్రోసార్కోమా అనే ప్రమాదకరమైన క్యాన్సర్ కణితి ఉన్నట్లు గుర్తించారు. తొలుత శస్త్రచికిత్స ద్వారా కణితిని తొలగించారు. అయితే కొద్ది రోజులకే క్యాన్సర్ మళ్లీ దవడ ఎముక వరకు వ్యాపించడం ప్రారంభించింది.
మరోసారి కేవలం శస్త్రచికిత్స చేస్తే పామును కాపాడటం కష్టమవుతుందని భావించిన చెస్టర్ జూ వెటర్నరీ నిపుణులు.. లివర్‌పూల్ విశ్వవిద్యాలయానికి చెందిన క్యాన్సర్ నిపుణులతో కలిసి ప్రత్యేక చికిత్సకు సిద్ధమయ్యారు. మనుషులకు అందించే ఎలక్ట్రోకెమోథెరపీని కొండచిలువ శరీర నిర్మాణానికి అనుగుణంగా మార్చి నిర్వహించాలని నిర్ణయించారు.
అయితే 15 అడుగుల పొడవు, సుమారు 50 కిలోల బరువున్న పాముకు ఆపరేషన్ చేయడం వైద్య బృందానికి పెద్ద సవాలుగా మారింది. సాధారణ ఆపరేషన్ టేబుల్ సరిపోకపోవడంతో రెండు పెద్ద టేబుళ్లను కలిపి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముందుగా క్యాన్సర్ సోకిన దవడ ఎముక భాగాన్ని తొలగించి.. అనంతరం మిగిలిన క్యాన్సర్ కణాలను నాశనం చేసేందుకు ఎలక్ట్రోకెమోథెరపీ చేశారు. చికిత్స అనంతరం కొన్ని నెలలకు నిర్వహించిన పరీక్షల్లో జోడీ శరీరంలో క్యాన్సర్ పూర్తిగా నయమైనట్లు వైద్యులు నిర్ధారించారు. దవడలో కొంత భాగం కోల్పోయినప్పటికీ.. ఆహారం తీసుకోవడం, సహజ ప్రవర్తనలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.
జంతువుకు, ముఖ్యంగా కొండచిలువకు ఇలాంటి అధునాతన క్యాన్సర్ చికిత్స అందించడం అరుదైన విజయంగా నిలిచింది. ఈ ఘటన జంతు వైద్యరంగంలో కొత్త అవకాశాలకు మార్గం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..