
వయసు పెరిగే కొద్దీ చాలామంది తమ కలలను పక్కన పెట్టేస్తారు. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన డాక్టర్ మంజుల మాత్రం అందుకు భిన్నంగా నిలిచారు. చిన్ననాటి నుంచి బైక్‌పై లేహ్-లడఖ్ వెళ్లాలన్న తన కలను 50 ఏళ్ల వయసులో సాకారం చేసుకున్నారు. అత్యంత క్లిష్టమైన పర్వత మార్గాల్లో బైక్‌పై ప్రయాణించి లేహ్-లడఖ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మార్గంలో బైక్‌పై ప్రయాణించిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు.
చిన్ననాటి నుంచే బైక్‌పై లేహ్-లడఖ్‌కు వెళ్లాలనే కలను కలిగిన డాక్టర్ మంజుల తన పట్టుదలతో ఆ కలను సాకారం చేసుకున్నారు. గద్వాల్‌లో జన్మించిన మంజుల విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితాన్ని మహబూబ్‌నగర్‌లో కొనసాగిస్తున్నారు. డాక్టర్ మంజుల చేపట్టిన యాత్రలో లేహ్ లోకల్ – మ్యాగ్నెటిక్ హిల్ – హాల్ ఆఫ్ ఫేమ్ – ఖర్దుంగ్ లా – నుబ్రా – తుర్తుక్ – థాంగ్ (భారత్‌లోని చివరి గ్రామం) – నుబ్రా – వారిలా – చాంగ్ లా – పాంగాంగ్ సరస్సు – లేహ్ వంటి అత్యంత క్లిష్టమైన ప్రాంతాలు ఉన్నాయి. ఎత్తైన పర్వత మార్గాలు, తీవ్రమైన చలి, కఠినమైన రహదారులు వంటి ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ.. ఆమె ఈ సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. అదేవిధంగా బంగీ జంప్ వంటి అత్యంత సాహసోపేతమైన విన్యాసాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసి తన ధైర్యసాహసాలను చాటుకున్నారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ అధికారికంగా డాక్టర్ మంజుల సాధించిన ఈ ఘనతను ధృవీకరించింది. ఈ మార్గంలో బైక్‌పై ప్రయాణించిన తొలి మహిళగా ఆమెను గుర్తించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డా. మంజుల మాట్లాడుతూ, “చిన్ననాటి నుంచి లేహ్-లడఖ్‌కు బైక్‌పై వెళ్లాలనే కల ఉండేది. భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం, సహకారం వల్లే ఈ కలను నిజం చేసుకోగలిగాను”అని తెలిపారు.
50 ఏళ్ల వయసులో బైక్‌పై లేహ్-లడఖ్ యాత్రతో పాటు బంగీ జంప్ వంటి సాహసాన్ని పూర్తి చేయడం ద్వారా వయసు కలలకు అడ్డంకి కాదని, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని డాక్టర్ మంజుల నిరూపించారు. ఆమె సాధించిన ఈ ఘనతకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేస్తూ, మహిళా సాధికారతకు, పట్టుదలకు, సాహసానికి, కలలను సాకారం చేసుకునే తపనకు డాక్టర్ మంజుల ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..