Reading Time: < 1 minute

శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు.. చంద్రవతి కళ్యాణమండపంలో నిర్వహణ

Caption of Image.

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో ధర్మ ప్రచారంలో భాగంగా ఈ రోజు ( ఆగస్టు 21) వరలక్ష్మి వత్రం సందర్భంగా సామూహిక వ్రతాలు జరిగాయి.  ఈ కార్యక్రమంలో 1800 మందికి పైగా భక్తి శ్రద్దలతో వ్రతాన్ని ఆచరించారు. మల్లికార్జుని  ఆలయ ఉత్తరద్వారం ఎదురుగా ఉన్న చంద్రవతి కల్యాణమండపంలో నిర్వహించారు.  ఈ వ్రతాలకు కావలసిన పూజాద్రవ్యాలు దేవాలయ అధికారులు సమకూర్చారు. 

సంప్రదాయబద్దంగా జరిగిన ఈ వ్రతంలో ముందుగా మహాగణపతి పూజ నిర్వహించబడింది. తరువాత శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిగాయి. వరలక్ష్మీవ్రతంలో భాగంగా భక్తులందరిచేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్ష్మీదేవిని  ఆవాహన చేశారు. శ్రీ సూక్తవిధానంలో వరలక్ష్మీదేవి అమ్మవారికి  షోడశోపచారపూజలు జరిపించారు. వ్రతకథ, వ్రత మహిమావిశేషాలు పండితులు వివరించారు.  చివరగా నీరాజనం..  మంత్రపుష్పం కార్యక్రమాలతో వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆలయ పూజారులు భక్తులచే చేయించారు. వ్రతాన్ని వీక్షించేందుకు చంద్రావతి కల్యాణమండపంలో ప్రత్యేకంగా ఎల్.ఈ.డి స్క్రీన్​  ఏర్పాటు చేశారు

వరలక్ష్మి వ్రతం ఆచరించిన భక్తులకు అమ్మవారి చీర, రవిక వస్త్రం, పూలు, గాజులు,  కంకణాలు, వృక్ష ప్రసాదంగా  తులసి మొక్క, పుస్తక ప్రసాదంగా శ్రీశైల ప్రభ మాసపత్రిక, మూడు రకాల  ప్రసాదాలు అందజేశారు.  ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనం  తరువాత  అన్నపూర్ణ భవనం నందు  భక్తులందరికీ అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి  యం. శ్రీనివాసరావు దంపతులు, ఆలయ అధికారులు, సిబ్బంది  పాల్గొన్నారు.   ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ మన వైదికసంప్రదాయంలో శ్రావణ మాసంలో  వరలక్ష్మీవ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా వస్తున్నదని తెలిపారు.
  
ధర్మ ప్రచారంలో భాగంగా  ధార్మిక కార్యక్రమాలను నిర్వహించేందుకు   దేవస్థానం  ఈ వరలక్ష్మీవ్రతాలను నిర్వహించింది. . జ్యోతిర్లింగస్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామివారు మహాశక్తి స్వరూపిణి శ్రీభ్రమరాంబాదేవివారు స్వయంవ్యక్తంగా వెలసిన శ్రీశైలమహాక్షేత్రంలో వరలక్ష్మీవ్రతాన్ని చేసిన వారు  ఎంతో అదృష్టవంతులన్నారు.  ధర్మకర్తల మండలి  సూచనల మేరకు  భక్తుల సౌకర్యార్థం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.