Reading Time: < 1 minute

విద్యార్థుల నడవడికను గమనించాలి..టీచర్ల సూచనలు పాటిస్తున్నారా లేదా చూడాలి ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Caption of Image.

మహబూబ్​నగర్, వెలుగు : ప్రభుత్వ పాఠశాల్లలో విద్యా వలంటీర్లు కేవలం పాఠాలు చెప్పడానికే పరిమితం కాకుండా విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నారా? హోంవర్క్ చేస్తున్నారా? టీచర్ల సూచనలు పాటిస్తున్నారా? వారి ప్రవర్తన ఎలా ఉంది? చదువులో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? వంటి అంశాలను గమనించాలని ప్రభుత్వ విప్, మహబూబ్​నగర్​ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు.

 ఎమ్మెల్యే సొంత నిధులతో  నిర్వహిస్తున్న ‘శతశాతం’లో భాగంగా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో నూతనంగా నియమించిన విద్యా వలంటీర్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

 పిల్లలను చిన్న వయస్సు నుంచే గమనిస్తూ వారి ఆలోచనా విధానం, ప్రవర్తన, చదువుపై ఆసక్తి వంటి అంశాలను పరిశీలించాలని సూచించారు. సరైన సమయంలో పిల్లలపై దృష్టి పెట్టకపోతే వారు చెడు మార్గం వైపు వెళ్లే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. విద్యా వాలంటీర్ల వ్యవస్థను ప్రత్యేకమైన బాధ్యతతో రూపొందిస్తున్నామని తెలిపారు. 

కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ మహిళలను విద్యా వలంటీర్లుగా నియమించడం ద్వారా నియోజకవర్గంలో విద్యా వ్యవస్థ మరింత పటిష్టంగా, సురక్షితంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.   నగర మేయర్ గుమ్మాల మమత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి  పాల్గొన్నారు.

పేదలందరికీ సొంత ఇల్లు 

హన్వాడ :  రాష్ట్రంలో ఇకపై ఎవరూ గుడిసెల్లో నివసించకూడదన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, పేదలందరికీ సొంత ఇల్లు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హన్వాడ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద మొదటి విడతలో వివిధ కారణాల వల్ల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోని అర్హులైన లబ్ధిదారులకు ఆయన ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు.
 

©️ VIL Media Pvt Ltd.