
- యూపీ సీఎం యోగితో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ
- తెలంగాణలో బీజేపీ పరిస్థితిపై యోగి ఆరా
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని, నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తే అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. యూపీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం యోగిని లక్నోలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అరగంటకు పైగా సాగిన ఈ భేటీలో తెలంగాణ రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ పూర్తిగా సహకరిస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొనసాగడం వల్ల పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకు యూపీ ఒక నిదర్శనమని గుర్తుచేశారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే రాష్ట్రంలోని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఎస్ఎస్‌బీ బ్యారక్‌ల ప్రారంభం
అంతకుముందు లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్‌లో సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) 4వ బెటాలియన్‌లో నూతనంగా నిర్మించిన జవాన్ల బ్యారక్‌లు, మెస్, నివాస భవనాలను బండి సంజయ్ ప్రారంభించారు. గోరఖ్‌పూర్, మహారాజ్‌గంజ్ భవన నిర్మాణాలకు ఆన్‌లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. భారత్-నేపాల్, భారత్-భూటాన్ సరిహద్దుల రక్షణలో ఎస్ఎస్‌బీ సేవలు అభినందనీయమని కొనియాడారు. సరిహద్దు భద్రత కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ వ్యవస్థీకృత నేరాలను సమర్థవంతంగా అరికడుతున్నారని ప్రశంసించారు.