
ఏ దేశంలో అయినా చట్టబద్ధ పాలన జరగాలంటే.. అందుకు పటిష్ఠమైన వ్యవస్థలు అవసరమౌతాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మన రాజ్యాంగ నిర్మాతలు న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలకు రూపకల్పన చేశారు. అలాగే ప్రతి వ్యవస్థ అధికారాల పరిధిని స్పష్టంగా నిర్వచించారు. ఒకరి అధికారాల పరిధిలోకి మరొకరి జోక్యం లేకుండా లక్ష్మణరేఖ గీశారు. అదే సమయంలో మిగతా వ్యవస్థల పనితీరును రాజ్యాంగబద్ధంగా సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు అప్పగించారు. కానీ ఈ అధికారాన్ని నియంత్రణగా కాకుండా.. ఓ అప్రమత్తతగానే చూడాలనేది నిపుణుల మాట. ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం ఓ పథకం తెస్తుంది. ఓ పాలసీ నిర్ణయిస్తుంది. అధికారులు ఆ పాలసీ లేదా పథకాన్ని అమలుచేస్తారు. ఈ అమలు తీరులో తప్పులు, లోపాలు, లోటుపాట్లను బట్టి.. అలాంటి సందర్భంలో కోర్టులు జోక్యం చేసుకుంటాయి. నిర్దిష్ట ఫిర్యాదులమేరకైనా, సుమోటోగా అయినా కూడా న్యాయస్థానాలు కల్పించుకోవచ్చు. కానీ అసలు పథకాలే తేవద్దని, న్యాయస్థానాలు అంటే అక్కడే ఘర్షణ వస్తుంది.
మనది ప్రజాస్వామ్య దేశం. అలాగే సమాఖ్య వ్యవస్థ. ఈ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎవరి బాధ్యతలు వారికున్నాయి. మళ్లీ అటు కేంద్ర స్థాయిలో.. ఇటు రాష్ట్రస్థాయిలో పాలన సజావుగా జరగటానికి ప్రత్యేక వ్యవస్థలున్నాయి. ఈ దేశంలో నిజమైన అధికారం ప్రజలదే అని చాటేది ప్రజాస్వామ్యం. మరి ఆ ప్రజల అవసరాలు తీర్చటానికి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనవే వ్యవస్థలు. పార్లమెంట్, అసెంబ్లీల్లో ప్రజల కోసం చట్టాలు చేస్తే.. వాటిని అమలు చేసే బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థ తీసుకుంటుంది. ఈ వ్యవస్థ పరిధిలోకి క్యాబినెట్‌తో పాటు అధికారులు, ఉద్యోగులు వస్తారు. అయితే అటు శాసన వ్యవస్థ, ఇటు కార్యనిర్వాహక వ్యవస్థ పరిధుల్లో జోక్యం చేసుకునే అవకాశం న్యాయవ్యవస్థకు లేదు. కానీ ఏ వ్యవస్థ చేసే పనులైనా.. రాజ్యాంగబద్ధంగా లేకపోతే.. కచ్చితంగా తప్పొప్పుల్ని కోర్టులు సమీక్షించొచ్చు. దీనికి ఏ వ్యవస్థా అభ్యంతరం చెప్పే పరిస్థితి ఉండదు. అంతేకాదు ఎవరు చెప్పినా.. ఆ విషయంపై అస్పష్టత ఉంటుందేమో కానీ.. ఒక్కసారి కోర్టు ఓ మాట చెప్పిందంటే.. కచ్చితంగా దేశంలో మిగతా వ్యవస్థలే కాదు.. ప్రజలు కూడా దానికి కట్టుబడతారు. సాధారణంగా ఈ వెసులుబాటే.. కోర్టుల్ని రాజ్యాంగానికి కాపలాదారుగా సక్సెస్‌ఫుల్‌గా నిలబెడుతోంది. కానీ కొన్ని సందర్భాల్లో కోర్టులు కూడా కట్టుదాటుతున్నాయా అనే సందేహాలొచ్చేలా కొన్ని ఆదేశాలు వస్తున్నాయి. అయితే అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు కోర్టులే తమ అధికారాల పరిధిపై క్లారిటీ ఇచ్చిన కేసులు కూడా ఉన్నాయి. అంటే మన న్యాయవ్యవస్థ కేవలం తీర్పులు చెప్పడమే కాదు.. అవసరమైతే ఆత్మవిమర్శకూ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటోంది. అంతేకాదు తమకు రాజ్యాంగం సర్వంసహా ఆధిపత్యం ఇచ్చిందని కూడా కోర్టులు ఇప్పటివరకు పొరపాటున కూడా అనుకోలేదు. పైగా కేవలం రాజ్యాంగ పరిరక్షకులుగా ఈ దేశ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వినమ్రంగా వాడుకుంటున్నామనే మాటనే చాలా స్పష్టంగా చెబుతూ వచ్చిన సందర్భాలు లేకపోలేదు.
కాకపోతే తెలంగాణలో ఇటీవలి కాలంలో కోర్టులు ఇస్తున్న ఆదేశాలపై చర్చ జరుగుతున్న మాట వాస్తవం. కొన్నాళ్ల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని కోర్టు ఇచ్చిన ఆదేశం చర్చనీయాంశమైంది. అసలు అలా ఆదేశించే అధికారం కోర్టుకు ఉందా.. లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై న్యాయవర్గాల్లోనూ భిన్నమైన వాదనలు వినిపించాయి. మొదట అసలు అధికారుల బదిలీలు, పోస్టింగులు ప్రభుత్వ పరిధిలోని అంశాలని, వాటపై కోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందనే సందేహాలు వచ్చాయి. తర్వాత కోర్టు ధిక్కరణ అంశం తెరపైకి రావడంతో.. అలాంటప్పుడు జరిమానాలు విధించే, శిక్షించే అధికారం కోర్టుకు ఉంటుందని, కానీ ఎవరిని ఏ పోస్టులో నియమించాలో కోర్టు ఎలా చెబుతుందని సర్కారు తరపు నుంచి కూడా అభిప్రాయం వచ్చింది. ఆ తర్వాత ఈ విషయంలో అప్పీళ్లకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఈ సంగతి పక్కనపెడితే.. తాజాగా సంక్షేమ పతకాలపై న్యాయస్థానాల అభిప్రాయాలు, ఆదేశాలు కూడా చర్చనీయాంశమౌతున్నాయి. సంక్షేమ పథకాల అమలుకు, జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు ముడిపెట్టడంపై కొత్త సందేహాలొచ్చాయి. రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యత ప్రకారం.. ప్రభుత్వాలకు సంచిత నిధిని తమ సౌలభ్యం, అవకాశాన్ని బట్టి ఖర్చు చేసే వీలుంది. ప్రభుత్వం అన్నాక సంక్షేమం, అభివృద్ధి, చెల్లింపులు అన్నీ చేయాల్సి ఉంటుంది. ఏది ఎప్పుడు చేయాలనేది పూర్తిగా ప్రభుత్వ విచక్షణాధికారం అనే వాదన కూడా లేకపోలేదు.
ఈ సందర్భంగా అసలు సంక్షేమ పథకాల అవసరం, ఉద్దేశాలపై కొత్త చర్చ మొదలైంది. మనది సంక్షేమ రాజ్యం కావాలని రాజ్యాంగ నిర్మాతలు అభిలషించారు. అందుకే అనుగుణంగా తొలినాళ్ల నుంచీ దేశంలో, రాష్ట్రాల్లో ఏ సర్కారు అధికారంలో ఉన్నా.. ఏదో రూపంలో సంక్షేమం కొనసాగుతూనే ఉంది. ఉదాహరణకు దేశవ్యాప్తంగా 80 శాతం ప్రజలకు రేషన్ బియ్య్ం అందుతోంది. కేంద్రం చేయాల్సిన చెల్లింపులు పూర్తిస్థాయిలో జరిగేదాకా.. రేషన్ బియ్యం పంపిణీ ఆపమంటే.. కుదురుతుందా.. అసలు అలా చెప్పే అధికారం కోర్టులకు ఉంటుందా అనేదే ఇక్కడ అసలు మీమాంస. దేశంలో సంక్షేమ పథకాల కారణంగానే కొన్నికోట్ల కుటుంబాలు జీవన స్థితిగతులు మెరుగయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. ఏకంగా తరాల తలరాతలు మార్చిన సంక్షేమ పథకాలు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అమలయ్యాయి. దేశంలో రేషన్ బియ్యం వచ్చాక ఆకలిచావులు గణనీయంగా తగ్గిన మాట కాదనలేని వాస్తవం. అదే సమయంలో సాగుకు సంక్షేమ దన్నుతో.. రైతుల కష్టాలు చాలా వరకు తగ్గిన మాట నిజం. మధ్యాహ్న భోజన పథకం.. స్కూల్ డ్రాపవుట్స్ సమస్యకు చెక్ పెట్టింది. గణనీయ సంఖ్యలో పిల్లలు బడిబాట పట్టారు
అసలు ఆరోగ్యశ్రీ లాంటి స్కీముల గురించి పునరాలోచన చేసే స్థితి కూడా లేదంటే.. దేశంలో, రాష్ట్రాల్లో సంక్షేమం అమలు సాధించిన విజయాలు అర్ధమౌతాయి.
దేశంలో ఇంకా దారిద్ర్య రేఖకు దిగువన కోట్ల మంది ఉన్నారు. వీరి కనీస అవసరాలు తీరాలన్నా, జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా సంక్షేమ పథకాలు తప్పనిసరి. ఎప్పుడో 1970ల్లోనే ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం ఇచ్చారు. బర్రె-గొర్రె లాంటి స్కీములు పెట్టారు. వివిధ వర్గాల జీవన పరిస్థితుల్ని బట్టి.. ప్రత్యేక పథకాలు తీసుకొచ్చారు. ఒక దేశ ఆర్థికాభివృద్ధి ఎంత ముఖ్యమో.. సామాజిక పురోగతి కూడా అంతే ప్రధానం. సామాజిక అభివృద్ధి జరగాలంటే అన్ని వర్గాలు ముందడుగు వేయాలి. అట్టడుగు వర్గాలకు చేయూత ఇవ్వడం తప్పనిసరి. అప్పుడే వారి జీవన ప్రమాణాలు మెరుగై.. దేశాభివృద్ధిలో భాగం పంచుకోవడం కుదురుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా సంక్షేమం వద్దనడం సబబు కాదనే అభిప్రాయాలున్నాయి.
చాలా దేశాలతో పోలిస్తే.. మన దగ్గర ఉచితాలు బాగా వర్కవుట్ అయ్యాయి. కోట్లాది మంది పేదలు పేదరికం నుంచి బయటికొచ్చి ఊహించని విధంగా దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. నిజంగా సంక్షేమ పథకాలే లేకపోతే అసలు కొన్ని వర్గాల ప్రజల జీవితం ఇప్పటికీ మారి ఉండేది కాదనే వాదనతో మేధావులూ ఏకీభవిస్తారు. మొత్తంగా సంక్షేమ పథకాలు కూడా మానవ అభివృద్ధికి, పోషకాహారం, పని మొదలగు వాటిపై ప్రజల మౌలిక హక్కుల సంరక్షణకు, ముఖ్యంగా గౌరవంగా జీవించే హక్కుకు దోహదం చేస్తాయి.
వృద్ధాప్య, ఒంటరి మహిళలు, వికలాంగుల పెన్షన్లు, పట్టణ ప్రాంతాల్లో కమ్యూనిటీ వంటశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఉచిత యూనిఫాం దుస్తులు, పాఠ్య పుస్తకాలు మరియు ఉచిత వైద్య సేవల లాంటి ఇతర అనేక పథకాలు…మన దేశంలో సామాజిక భద్రత, మౌలిక సదుపాయాల కల్పనలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. వాస్తవానికి ఈ పథకాలలో అనేక లోపాలున్నాయి. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా విస్తరించాలి. ఎక్కువ వనరుల కేటాయింపులు జరగాలి. జవాబుదారీతనం, సమస్యల పరిష్కారానికి యంత్రాంగాలను పెంచాల్సిన అవసరం ఉంది. ఈ లోపాలు సరిదిద్దుకోవాలనడం తప్పు కాదు. ఆ లోపాల గురించి కోర్టులు ప్రస్తావన చేయొచ్చు. వాటిని మరింత మెరుగ్గా ఎలా అమలు చేయాలో సలహా ఇవ్వొచ్చు. అంతేకాదు పథకాలు చట్టబద్ధం కాకపోయినా, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగినా.. కోర్టుకు శిక్షించే అధికారం ఎప్పుడూ ఉంటుంది. అంతేకానీ అసలు సంక్షేమం ఉండొద్దనడం మాత్రం సరైన పద్ధతి కాదనే వాదన వినిపిస్తోంది.