Reading Time: 2 minutes

వెలుగు ఓపెన్ పేజీ:ఈవీ విప్లవం.. ప్రకృతిపై ఎంత భారం!

Caption of Image.

ప్రపంచం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా అడుగులు వేస్తోంది.  భారతదేశం సైతం  నగరాలను కాలుష్యరహితం చేయడానికి ఈవీలకు ప్రాధాన్యత ఇస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లోనూ దీనికి సంబంధించి కార్యాచరణ కొనసాగుతోంది.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  కాలుష్యం నుంచి  విముక్తి చేయడానికి  ‘క్యూర్’  పరిధిలో ఈవీ ఆటోలకు ప్రోత్సాహకాలు,  సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 

అయితే  ఈవీల  వల్ల  పట్టణాలు,  నగరాల్లో  కాలుష్యాన్ని  కొంతమేర  నివారించగలిగినా.. వాటి తయారీకి అవసరమయ్యే  ఖనిజాల కోసం  గ్రామాలు, అడవులు, పర్వతాలు,  తద్వారా  ప్రకృతికి ఎంతమేరకు  నష్టం జరుగుతుందో ప్రభుత్వాలు ఒక అంచనా వేసుకోవాల్సిన  సమయం ఆసన్నమైంది.  సాధారణ  పెట్రోల్ కారు కంటే ఈవీ కారును తయారుచేయడానికి ఆరు రెట్లు ఎక్కువ ఖనిజాలు అవసరమవుతాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది.

ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీలు, మోటార్లు, విద్యుత్ 

వ్యవస్థల కోసం రాగి, లిథియం, నికెల్, కోబాల్ట్, గ్రాఫైట్ వంటి ఖనిజాలు ఎక్కువగా అవసరం కావడమే దీనికి  కారణమని తేల్చింది.  ఈవీ మార్కెట్  పుంజుకుంటుండడంతో ఈ ఖనిజాలకు సైతం డిమాండ్  పెరుగుతున్నది.  2040 నాటికి వీటి  డిమాండ్ రెట్టింపవుతుందని  ఐఈఏ  అంచనా వేసింది. 

మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమస్యే

ఈవీల తయారీకి అవసరమయ్యే  ఖనిజాలు  వెలికితీయాలంటే  పెద్ద గనులు ఏర్పాటు చేసి మైనింగ్  చేయాల్సి ఉంటుంది. దీనికోసం అడవులను  నరకడం, కొండలను తొలగించడం వంటి చర్యలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. దీనివల్ల కూడా పర్యావరణంపై  తీవ్ర ప్రభావం పడి వేరే మార్గాల ద్వారా కాలుష్యం పెరగవచ్చు. గనుల ప్రాంతాలను బట్టి వ్యర్థాలు, నీటి కాలుష్యం, నేలపై పడే ప్రభావం వల్ల స్థానిక జీవ వైవిధ్యానికి ముప్పు తలెత్తవచ్చు. 

‘రీసైక్లింగ్’ చేస్తే..

2025 నాటికి ప్రపంచ ఈవీ బ్యాటరీ వినియోగం 1.2 టెరావాట్ గంటలకు చేరింది. 2020తో  పోలిస్తే  ఏది ఏడు రెట్లు ఎక్కువ. భవిష్యత్తులో ఈ డిమాండ్‌ను తట్టుకోవాలంటే వాడేసిన  బ్యాటరీలను రీసైక్లింగ్ చేయడం అత్యంత కీలకం.  2040 నాటికి అవసరమైన ఖనిజాల్లో 20 శాతం వాటా రీసైక్లింగ్ ద్వారానే వస్తుందని అంచనా.  దీంతో  రీసైక్లింగ్‌పై ప్రభుత్వాలు ఇప్పటినుంచే దృష్టి పెట్టాలి.  పటిష్టమైన రీసైక్లింగ్ పాలసీని రూపొందించాలి. ఒక వాహనంలో వాడే బ్యాటరీ జీవితకాలం ఎంత?  పాడైపోయాక దాన్ని ఎక్కడ రీసైక్లింగ్ చేయాలి?  అనే  విషయాలను పొందుపర్చాలి. 

ప్రజారవాణే ప్రస్తుత పరిష్కారం 

ప్రతి పెట్రోల్ కారు స్థానంలో ఈవీని  రోడ్డెక్కిస్తే  పర్యావరణ, కాలుష్య సమస్య తీరదు.  దీనివల్ల ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలకు పరిష్కారం దొరకదు. ముందుగా వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించాల్సి ఉంటుంది.  మెట్రో, రైళ్లు, బస్సుల వైపు  ప్రజలను మళ్లించాల్సి ఉంటుంది. అప్పుడే  వాహనాల అవసరం తక్కువ అవుతుంది.  తద్వారా  ఖనిజాల తవ్వకాలు తగ్గి ప్రకృతిపై పడుతున్న భారం తగ్గుతుంది.  

ఈవీతో తగ్గే కాలుష్యమెంత?

ఎలక్ట్రిక్ వాహనాలు వంద శాతం కాలుష్య రహిత వాహనాలు కావు.  పెట్రోల్ కార్లతో  పోలిస్తే  మనదేశంలో వీటి  జీవితకాల ఉద్గారాలు సుమారు 20 శాతం మాత్రమే తక్కువగా ఉన్నాయని అనేక నివేదికలు చెప్తున్నాయి. మరోవైపు ఈవీ తయారీకి అవసరమయ్యే ఖనిజాలు తవ్వే సమయంలో,  వాటిని శుద్ధి చేసే సమయంలో,  బ్యాటరీ తయారు చేసే సమయంలో  పర్యావరణంపై  తీవ్ర ప్రభావం ఉంటుంది. అంటే ఈవీల ద్వారా ఓవైపు నగరాల్లో కాలుష్యాన్ని తగ్గిస్తూ..  గనుల తవ్వకాల పేరుతో  మరోచోట పర్యావరణానికి హాని చేస్తున్నామా? అనేది మనం నిర్ధారించుకోవాల్సి ఉన్నది.

– నూకల దేవేందర్
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.

©️ VIL Media Pvt Ltd.