Reading Time: 2 minutes

ఈ బిల్లు పొట్టిగా లావుగా ఉన్న నల్ల చొక్కా వాడిది : రెస్టారెంట్ బిల్లులో ఇలాగే రాశారు..!

Caption of Image.

మనం రెస్టారెంట్ అండ్ బార్లకు వెళ్లినప్పుడు.. మన పేరు వెయిటర్ల తెలియదు కదా.. అందుకే టేబుల్ నెంబర్ చెబుతారు.. టేబుల్ నెంబర్ ఆధారంగా బిల్లు కొడతారు.. ఇది కామన్. ఇక టేబుల్ నెంబర్ గుర్తు లేనప్పుడు ఆ నల్ల చొక్కా.. ఎర్ర ప్యాంట్.. జర్కీన్ వేసుకున్న వ్యక్తి.. పొట్టిగా.. ఎత్తుగా ఉన్నాడు చూడండీ.. ఆ మూల టేబుల్ పై కూర్చున్నాడు ఇలా చెబుతారు.. ఇది కూడా కామన్.. కాకపోతే ఇలా వెయిటర్ చెప్పిన మాటలనే.. బిల్లింగ్ పర్సన్.. కస్టమర్ పేరు కింద రాసేశారు.. అవునా అని ఆశ్చర్యపోతున్నారా.. పేరు కింద అతని బాడీ షేమింగ్ రాసిన రెస్టారెంట్ బిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. ఆ ఫన్నీ ఇన్సిడెంట్ డెటెయిల్డ్ స్టోరీ మనమూ చదివేద్దామా…

బెంగళూరులోని ఒక ఫేమస్ కేఫ్‌కు సరదాగా వెళ్లి భోజనం ఆస్వాదించాలనుకున్న ఓ కస్టమర్‌కు ఊహించని అవమానం ఎదురైంది. సాధారణంగా రెస్టారెంట్లలో బిల్లులపై కస్టమర్ల పేర్లు, టేబుల్ నంబర్లు, ఫోన్ నంబర్లు లాంటివి ప్రింట్ చేయటం మనం చూస్తుంటాం. కానీ ఆ బెంగళూరు టెక్కీకి అందిన బిల్లులో పేరు బదులుగా అభ్యంతరకరంగా “లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్” అని ప్రింట్ చేశారు. కస్టమర్ పేరు తెలియకపోతే అడిగి తెలుసుకుని బిల్ పై ప్రింట్ చేయాలి కానీ పొట్టిగా ఉన్న నల్లచొక్కా వేసుకుని వ్యక్తి అంటూ బిల్లుపై రాయటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాధితుడు సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు.

కోరమంగళలోని ప్రసిద్ధ ‘సబ్కో ది క్రాఫెరీ’ కేఫ్‌కు వెళ్లిన ఆ వ్యక్తి తాను ఆర్డర్ చేసిన ఫుడ్‌కు బిల్లు చెల్లించిన తర్వాత ఈ విచిత్రమైన విషయాన్ని గమనించాడు. తన పేరును రాయాల్సింది పోయి.. తన బాడీ టైప్‌ను, తాను వేసుకున్న బట్టలను బేస్ చేసుకుని ఇలా అవమానకరంగా ప్రింట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. కేవలం మగవాడు అయ్యాడన్న ఒకే కారణంతో బాడీ షేమింగ్‌ను ఎవరూ ఒక జోక్‌గా తేల్చిపారేయలేరని, ఇది వ్యక్తిగత గౌరవాన్ని కించపరచడమేనని వాపోయాడు. కస్టమర్లను గుర్తించడానికి పేర్లు, ఆర్డర్ వివరాలు, టేబుల్ నంబర్లు ఇలా ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ.. ఇలా శరీరాన్ని గేలి చేయడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ ఘటనకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ‘సబ్కో డి క్రాఫెరీ’ పేరుతో రెడ్డిట్‌లో షేర్ చేయడంతో ఆ పోస్ట్ క్షణాల వ్యవధిలో వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందించారు. సిబ్బంది చేసిన ఈ పని కేవలం జోక్ కాదని, పూర్తిగా బాధ్యతారాహిత్యమని కొందరు మండిపడగా, ఇలాంటి ఘటనలు కస్టమర్ల పట్ల రెస్టారెంట్ల నిర్లక్ష్య వైఖరిని అద్దం పడుతున్నాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతుండటంతో సబ్కో కేఫ్ యాజమాన్యం వెంటనే అప్రమత్తమైంది.

ALSO READ : 76 ఏళ్లు జైలులోనే.. 8 సార్లు మరణ శిక్ష తప్పించుకుని..

తమ సిబ్బంది చేసిన తప్పుకు సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పింది. కొన్ని విషయాలను సైలెంట్‌గా పరిష్కరించుకోవచ్చని.. కానీ ఇలాంటి వాటిని మాత్రం బహిరంగంగానే సరిదిద్దుకోవాలని యాజమాన్యం స్పష్టం చేసింది. మౌనంగా ఉంటే ఇలాంటి సంస్కృతి మరింత పెరుగుతుందని అభిప్రాయపడింది. “ఫ్యాట్ షేమింగ్ ఏ రూపంలో ఉన్నా, ఎప్పుడైనా అది తప్పు, ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవు” అని తేల్చిచెప్పింది. బాధితుడు నేరుగా తమ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిషన్‌ను సంప్రదించేలా ఏర్పాట్లు చేసి బాధ్యతాయుతంగా వ్యవహరించింది.

ఈ ఘటన హాస్పిటాలిటీ రంగాల్లో కస్టమర్ల పట్ల సిబ్బంది ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి గుర్తుచేసింది. ఒక చిన్న నిర్లక్ష్యం లేదా బాధ్యత రహితమైన జోక్ ఎంతటి పెద్ద వివాదానికి దారితీస్తుందో ఈ ఘటన నిరూపించింది.

©️ VIL Media Pvt Ltd.