
వరంగల్: మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను బీట్ కానిస్టేబుల్ లాఠీతో చితకబాదిన ఘటన వరంగల్ జిల్లాలో వెలుగుచూసింది. వరంగల్ జిల్లా ఉర్సు గుట్ట దగ్గర ఉన్న ఒక బార్‌లో మద్యం తాగి బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేస్తున్నాడని బార్ సిబ్బంది 112కి డయల్ చేసి ఫిర్యాదు చేశారు.
దీంతో.. వెంటనే బార్ దగ్గరకు వెళ్లిన బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి, బెటాలియన్ కానిస్టేబుల్‌ను షర్ట్ వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. మద్యం మత్తులో ఉన్న బెటాలియన్ కానిస్టేబుల్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా తిడుతుండటంతో బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి.. బెటాలియన్ కానిస్టేబుల్ను చెంపపై కొట్టాడు.
బెటాలియన్ కానిస్టేబుల్ కూడా సంతోష్ రెడ్డి చెంప చెళ్లుమనిపించాడు. దీంతో.. ఇద్దరు కానిస్టేబుల్స్ మధ్య గొడవ ముదిరింది. తాగి న్యూసెన్స్ చేస్తున్నాడని సర్ది చెప్పి పంపించేందుకు ప్రయత్నిస్తుంటే తననే తిరిగి కొట్టడంతో కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయాడు. లాఠీతో బెటాలియన్ కానిస్టేబుల్ను చితకబాదాడు. సంతోష్ రెడ్డికి తోడు బార్ సిబ్బంది, స్థానికులు కూడా బెటాలియన్ కానిస్టేబుల్పై దాడి చేశారు.
దీంతో.. భయంతో అక్కడి నుంచి పారిపోయేందుకు బెటాలియన్ కానిస్టేబుల్ ప్రయత్నించాడు. వెంట పడి మరీ కొట్టారు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఇద్దరు కానిస్టేబుల్స్ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో స్థానికంగా ఈ ఘటన హాట్ టాపిక్ అయింది.