
మధ్యాహ్నమైనా, రాత్రైనా.. కడుపునిండా భోజనం చేయగానే చాలామందికి తీవ్రమైన నీరసం, నిద్రమత్తు ఆవహిస్తాయి. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా మంచం మీదకో, సోఫాలోకో చేరి విశ్రాంతి తీసుకుంటారు లేదా కునుకు తీస్తుంటారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం భోజనం చేసిన వెంటనే పడుకోవడం లేదా కదలకుండా కూర్చోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. తిన్న తర్వాత కేవలం 10 నిమిషాల పాటు తేలికపాటి నడక సాగిస్తే శరీరానికి ఊహించని ప్రయోజనాలు లభిస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం వల్ల పొట్టలోని జీర్ణవ్యవస్థ వేగంగా ఉత్తేజితమవుతుంది. శరీర కదలికల వల్ల ఆహారం జీర్ణనాళంలోకి సులభంగా కదులుతుంది. దీనివల్ల తిన్న తర్వాత వచ్చే కడుపు ఉబ్బరం, పొట్టలో బరువుగా అనిపించడం, ఎసిడిటీ వంటి అసౌకర్యాలు పూర్తిగా తగ్గి జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
బరువు నియంత్రణ, జీవక్రియ పెరుగుదల
ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాల వాకింగ్ చేయడం వల్ల మెటబాలిజం రేటు గణనీయంగా పెరుగుతుంది. దీని ద్వారా శరీరంలో అదనపు కేలరీలు వేగంగా ఖర్చవుతాయి. ముఖ్యంగా రాత్రి భోజనం ముగించి కాసేపు నడిచి నిద్రపోవడం వల్ల నిద్రలోనూ జీవక్రియ చురుగ్గా ఉండి సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
భోజనం తర్వాత వచ్చే నిద్రమత్తు దూరం
భారీ భోజనం చేసిన తర్వాత రక్తప్రసరణ జీర్ణవ్యవస్థ వైపు ఎక్కువగా కేంద్రీకృతమై బద్ధకం, నీరసం ఆవరిస్తాయి. తిన్న వెంటనే కొద్దిసేపు నెమ్మదిగా నడవడం వల్ల శరీర కణాలకు ఆక్సిజన్ సరఫరా పెరిగి శరీరం రీఛార్జ్ అవుతుంది. దీంతో నిద్రమత్తు వదిలిపోయి రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు.
ఒత్తిడి తగ్గింపు.. మూడ్ రీఫ్రెష్
నడక అనేది శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. నడవడం వల్ల ఒత్తిడిని పెంచే కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్ల స్థాయిలు తగ్గి, శరీరంలో ఆనందాన్నిచ్చే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇది ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తప్రసరణ మెరుగుపడి శరీరం నుంచి టాక్సిన్లు బయటకు పోవడం ద్వారా రోగనిరోధక శక్తి బలపడుతుంది.
వాకింగ్ ఎలా ఉండాలి?
భోజనం చేసిన వెంటనే వేగంగా లేదా ఎక్కువ ఒత్తిడితో నడవకూడదు. వేగంగా నడిస్తే కడుపులో నొప్పి లేదా అసౌకర్యం కలిగే ప్రమాదం ఉంది. కేవలం తేలికపాటి వేగంతో, నెమ్మదిగా 10 నుంచి 15 నిమిషాలు నడవడమే శరీరానికి మంచిది.