
- సఫెమా చట్టాన్ని అస్త్రంగా మలుచుకున్న ఈగల్ ఫోర్స్
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్, గంజాయి సప్లయర్లపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతోంది. మాదకద్రవ్యాల విక్రయాలతో సంపాదిస్తున్న అక్రమ ఆస్తులను జప్తు చేస్తోంది. ఇందుకోసం ‘స్మగ్లింగ్ అండ్ ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మానిప్యులేటర్స్’ (సఫెమా) చట్టాన్ని అస్త్రంగా చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నమోదైన ఆల్ప్రాజోలం కేసులో 15 మందికి చెందిన రూ.6 కోట్ల విలువైన స్థిరచరాస్తులను శుక్రవారం ఈగల్ ఫోర్స్ అధికారులు జప్తు చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అమర్ సింగ్ దేశ్‌ముఖ్, బాబూరావు బస్వరాజ్ కదేరే, మల్లెపుల లక్ష్మణ్ గౌడ్ తదితరులతో కలిపి గతంలో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరి వద్ద నుంచి 32.5 కిలోల ఆల్ప్రాజోలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్అమ్మకాల ద్వారా సంపాదించిన సొమ్ముతో 9.06 ఎకరాల వ్యవసాయ భూమి, 1,370 చదరపు గజాల ఖాళీ స్థలాలు, నాలుగు కార్లు, రెండు బైకులను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వీటితో పాటు ఒక ఆల్ప్రాజోలం ఫ్యాక్టరీని సీజ్ చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.6 కోట్లు ఉంటుందని గుర్తించారు. చెన్నైలోని సఫెమా కాంపిటెంట్ అథారిటీకి నివేదిక పంపగా.. విచారణ అనంతరం అథారిటీ జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ ఆస్తులను జప్తు చేసినట్లు ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా వెల్లడించారు.