
- సైబరాబాద్ ఫేక్ కాల్ సెంటర్ల మోసం కేసులో ఇన్వెస్టిగేషన్ స్పీడప్
- అమెజాన్ గిఫ్ట్ కార్డుల పేరిట అమెరికన్లను మోసం చేసిన కేటుగాళ్లు
- 2023లో కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు, ఈడీ దర్యాప్తు
- అమెరికా ఎంబసీ, ఇంటర్‌పోల్ సమాచారంతో రంగంలోకి దిగిన ఎఫ్‌బీఐ
హైదరాబాద్, వెలుగు: సైబరాబాద్ కేంద్రంగా ఫేక్ కాల్ సెంటర్లు నిర్వహిస్తూ అమెరికన్లే టార్గెట్‌గా మోసాలకు పాల్పడిన కేసులో అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఈడీ అధికారులతో భేటీ అయిన ఎఫ్‌బీఐ..సుమారు రూ.200 కోట్ల నేరపూరిత ఆదాయానికి సంబంధించిన వివరాలు, మనీలాండరింగ్ కోణాలపై ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేసింది. 2023లో మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుతో పాటు మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారుల నుంచి పూర్తి సమాచారం సేకరించింది.
మాదాపూర్ పీఎస్‌లో నమోదైన కేసుపై ఈడీ దర్యాప్తు
ఓ ముఠా నకిలీ టెక్నికల్ సపోర్ట్ సంస్థలు, ప్రభుత్వ విభాగాల అధికారుల పేర్లతో అమెరికా పౌరులను మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కాల్ సెంటర్ వ్యవహారంపై 2023లో సైబరాబాద్ కమిషనరేట్‌లోని మాదాపూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.అమెరికా ప్రభుత్వ సంస్థల పేర్లు ఉపయోగించి భయపెట్టడం.. అనంతరం డబ్బులు చెల్లించాల్సిందేనని ఒత్తిడి చేసి, నగదు బదిలీ చేయించుకున్నట్లు తేల్చారు.
మొహమ్మద్ ఇర్ఫాన్ అన్సారీతోపాటు వికాస్ కుమార్ నిమార్ అలియాస్ మిస్టీ, ఆయన తండ్రి తారాచంద్ నిమార్‌ను ఈ ఏడాది ఆగస్టు 10న అరెస్టు చేశారు. ఇదే కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మేరకు అమెరికా ఎంబసీ, ఇంటర్‌పోల్ నుంచి వచ్చిన సమాచారంతో ఎఫ్‌బీఐ కూడా దర్యాప్తు ప్రారంభించింది. కాల్ సెంటర్ నెట్‌వర్క్‌పై దర్యాప్తు కేవలం స్థానిక మోసంగా కాకుండా.. అంతర్జాతీయ సైబర్- ఫైనాన్షియల్ క్రైమ్ నెట్‌వర్క్‌గా విస్తరిస్తున్నట్లు గుర్తించింది.
కాల్ సెంటర్ గుట్టు విప్పుతున్న ఈడీ, ఎఫ్‌బీఐ
అమెజాన్ గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేయించేలా మోసగాళ్లు ఒత్తిడి చేసేవారని ఇప్పటికే ఈడీ దర్యాప్తులో వెలుగు చూసింది. ఆ గిఫ్ట్ కార్డులను విదేశాల్లోని విక్రేతల ద్వారా నగదుగా మార్చి, అనంతరం ఆ మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.క్రిప్టో ట్రేడర్ల ద్వారా, హవాలా, అంగడియా మార్గాల ద్వారా ఆ డబ్బును తిరిగి భారత్‌కు తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది.
కాగా, నిందితులు 2017 నుంచే నకిలీ కాల్ సెంటర్ల నిర్వహణలో ఉన్న అన్సారీ నెలకు సగటున 60,000 నుంచి 70,000 అమెరికన్ డాలర్ల వరకు వసూళ్లు చేసినట్టు దర్యాప్తులో తేలింది. రూ.200 కోట్లుగా అంచనా వేస్తున్న నేరపూరిత ఆదాయానికి అసలు మూలాలు ఏమిటి? ఎవరి ఖాతాల ద్వారా డబ్బు తిరిగింది? విదేశాల్లోని ఏ వ్యక్తులు లేదా సంస్థలు ఈ నెట్‌వర్క్‌కు సహకరించాయి? అసలు సూత్రధారులు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ఎఫ్‌బీఐ, ఈడీ దర్యాప్తు ముమ్మరం చేశాయి.