Reading Time: < 1 minute
Indus Waters Treaty Pakistan Minister Ahsan Iqbal Warns India Could Use Water As A Weapon

Indus Waters Treaty: పాకిస్తాన్ మరోసారి ‘‘సింధు జలాల ఒప్పందం’’పై స్పందించింది. ఆ దేశ ప్రణాళికా మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ఇటీవల ఇండస్ వాటర్ ట్రీటీ, దక్షిణాసియాలో భారత్ వ్యూహాత్మక ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు నది నీటిని ఆపేయడం ద్వారా భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా నీటిని ఆయుధంగా ఉపయోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఒక నదీతీర దేశమని, అక్కడి నుంచి ప్రవహించే నదులు పాకిస్తాన్‌లోకి ప్రవేశిస్తాయని ఇక్బాల్ పేర్కొన్నారు. ఈ భౌగోళిక పరిస్థితిని భారత్ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోందని, పాకిస్తాన్ నీటి సరఫరాను నియంత్రించే అవకాశం ఉందని ఆయన అన్నారు.

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడులు నిర్వహించడానికి ముందు ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు తెలిపినంత కాలం ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదని భారత్ స్పష్టం చేసింది. అయితే, ఇది ఏకపక్ష నిర్ణయమని పాక్ ఆరోపిస్తోంది. పాకిస్తాన్ వ్యవసాయం, తాగునీటికి సింధు, దాని ఉపనదులు జీవనాడిగా ఉన్నాయి. ఈ నీటిని నియంత్రిస్తే పాకిస్తాన్ కరువుతో అలమటించడం ఖామని ఆ దేశంలో ఆందోళన నెలకొంది.

ఇదే సమయంలో అహ్సాన్ ఇక్బార్ మరో కీలక వ్యాఖ్య చేశారు. దక్షిణాసియాలో భారత్ భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉందని, ఈ ప్రాంతం సక్రమంగా ఉండాలంటే భారత్ పాత్ర చాలా ముఖ్యమని పేర్కొన్నారు. దక్షిణాసియాలోని ఇతర దేశాలకు వివిధ మార్గాల్లో భారత్ కనెక్ట్ అయి ఉందని అన్నారు. భారతదేశ పరిమాణం, ఆర్థిక శక్తి, భౌగోళిక స్థానం కారణంగా ఈ ప్రాంత వ్యవహారాల్లో దాని ప్రాధాన్యతను విస్మరించలేమని అన్నారు. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ మధ్య ‘‘సింధు జలాల ఒప్పందం’’ కుదిరింది. రెండు దేశాల ఉద్రిక్తతల కారణంగా మరోసారి ఈ ఒప్పందం వార్తల్లో నిలిచింది.