Reading Time: < 1 minute

గంగాధర: ముంపు గ్రామంగా ప్రకటించాల్సిందే : నారాయణపూర్ గ్రామస్తులు

Caption of Image.
  •     సీపీఐ, ఏఐఎఫ్​బీ, బీఆర్ఎస్​నాయకుల ఆందోళన
  •     గ్రామస్తులు, పోలీసుల మధ్య తోపులాట
  •     ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడికి యత్నం

గంగాధర, వెలుగు: తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్​ గ్రామస్తుల ఆందోళన కొనసాగుతోంది. మధురానగర్ ​చౌరస్తాలోని కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై శనివారం ధర్నా చేపట్టగా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఏఐఎఫ్​బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి జోజిరెడ్డి మద్దతు పలికారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక నారాయణపూర్​ను ముంపు గ్రామం చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇప్పుడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ ​రెడ్డి స్పందించి నారాయణపూర్​ను ముంపు గ్రామంగా ప్రకటించి నష్ట పరిహారం అందించాలని కోరారు. ధర్నాకు దిగిన గ్రామస్తులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురికి స్వల్పగాయాలు కాగా, సహీన అనే మహిళ కాలు విరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. 

అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రజా కార్యాలయాన్ని ముట్టడించేందుకు మహిళలు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. సుంకె రవిశంకర్​తోపాటు పలువురు గ్రామస్తులను రామడుగు పోలీస్ స్టేషన్​కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్​ను గ్రామస్తులు ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయడంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ సదర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకుంటానన్న మేడిపల్లి సత్యం నారాయణపూర్ గ్రామస్తులపై కేసులు పెట్టడం విడ్డూరమన్నారు. గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

©️ VIL Media Pvt Ltd.