
బెంగళూర్: కర్నాటక రాజధాని బెంగళూరులో భారీగా నగదు పట్టుబడింది. నగర శివార్లలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో కారులో తరలిస్తోన్న రూ.9 కోట్ల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారుల సమాచారం మేరకు పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. కేరళ రిజిస్ట్రేషన్ కలిగిన హ్యుందాయ్ క్రెటా కారులో బెంగుళూరు నుంచి తమిళనాడుకు భారీగా డబ్బు తరలిస్తున్నారని ఐటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే రంగంలోకి దిగిన ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు హోసూర్ రోడ్డులోని బీఈటిఎల్ (BETL) టోల్ ప్లాజా సమీపంలో తనిఖీలు చేపట్టి కారును అడ్డగించారు. అనంతరం కారును పోలీస్ స్టేషన్కు తరలించి సోదాలు చేశారు. కారులోని ఓ సూట్ కేసులో భారీగా డబ్బు గుర్తించారు. మొత్తం ఐదు వందల రూపాయల నోట్ల కట్టలే. ఐటీ అధికారులు రంగంలోకి దిగి డబ్బు లెక్కించగా మొత్తం రూ.9 కోట్లు ఉన్నట్లు తేలింది.
►ALSO READ | గుజరాత్ లో కల్తీ మద్యం కలకలం… 8 మంది మృతి, 25 మందికి తీవ్ర అస్వస్థత..
కారులో ప్రయాణిస్తోన్న ఇద్దరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు. కేసు విచారణలో భాగంగా తమిళనాడులోని నిందితులకు సంబంధించిన నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. తనిఖీల్లో రూ. 1.3 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనితో మొత్తం స్వాధీనం చేసుకున్న సొమ్ము రూ. 10.3 కోట్లకు చేరింది. ఈ ఘటనపై ఐటీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. డబ్బు ఎక్కడిది.. డబ్బును ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు