Reading Time: < 1 minute
Ap Local Elections 34 Bc Reservation In Panchayat Raj Institutions

BC Reservation: ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. మరోవైపు వెనుకబడిన తరగతులకు శుభవార్త చెబుతూ.. రిజర్వేషన్‌ కోటాను పెంచింది ప్రభుత్వం.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్‌ సంస్థల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లలో బీసీలకు ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి.

జీవో ఎంఎస్‌ నంబర్‌ 105 ద్వారా ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది. గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్ల పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో పంచాయతీరాజ్‌ సంస్థల్లో బీసీలకు కల్పించిన రిజర్వేషన్‌ 34 శాతం నుంచి 24.15 శాతానికి తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక, నగర పాలక సంస్థల్లోనూ బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లైంది. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి పంచాయతీరాజ్‌, గ్రామీణ ఉపాధి కమిషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్లు తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక ఎన్నికల ప్రక్రియలో ఈ రిజర్వేషన్లను అమలు చేయనున్నారు.