
న్యూఢిల్లీ: ఐఐటి ఢిల్లీ క్యాంపస్‌లో ఘోరం జరిగింది. ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని ఎంఎస్సీ ఫిజిక్స్ స్టూడెంట్‌గా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం ఉదయం (ఆగస్ట్ 22) ఉదయం ఓ స్టూడెంట్ ప్రధాన ద్వారం గుండా క్యాంపస్‌లోకి ప్రవేశించాడు. అనంతరం లెక్చర్ హాల్ కాంప్లెక్స్‌కు చేరుకుని అక్కడి నుంచి లిఫ్ట్‌లో 6వ అంతస్తుకు వెళ్లి అక్కడి నుండి కిందికి దూకాడు.
గమనించిన క్యాంపస్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కిషన్‌గఢ్ స్టేషన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే లోపే విద్యార్థి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కిషన్‌గఢ్ స్టేషన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
విద్యార్థి మృతి గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. చదువు ఒత్తిడి వల్ల సూసైడ్ చేసుకున్నాడా.. లేక మరేదేమైనా కారణం ఉందని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించలేదని తెలిపారు. క్రైమ్ టీమ్, ఫోరెన్సిక్ సైన్స్ బృందం ఘటన స్థలంలో సాక్ష్యాధారాలు సేకరించాయి.