Reading Time: < 1 minute

గచ్చిబౌలి అంజయ్య నగర్లో కూలిపోయిన బిల్డింగ్ గురించి షాకింగ్ విషయాలు బయటకి..

Caption of Image.

హైదరాబాద్: గచ్చిబౌలి అంజయ్య నగర్లో కుప్పకూలిన బిల్డింగ్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బిల్డింగ్ నిర్మాణానికి ఎలాంటి పర్మిషన్లు లేవని, ఈ బిల్డింగ్ యజమాని సాజిద్ ఖాన్ 48 గజాల్లో 7 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. బిల్డింగ్ నిర్మాణం నాలాకు ఆనుకుని జరుగుతుంది. బిల్డర్కి నిర్మాణం కాంట్రాక్ట్ ఇచ్చిన సాజిద్ ఖాన్.. లోకల్ టౌన్ ప్లానింగ్ అధికారులను మేనేజ్ చేస్తూ ఇల్లీగల్గా బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నట్లు తేలింది.

గతేడాది ఇదే ప్రాంతంలో ఇల్లీగల్గా నిర్మించిన ఐదంతస్తుల భవనం కూలిపోయింది. అప్పట్లో హడావిడి చేసి కొన్ని రోజుల పాటు ఇల్లీగల్ నిర్మాణాలు చేయకుండా చూసిన అధికారులు కొన్నాళ్లకు పట్టించుకోకుండా వదిలేశారు. అప్పటి నుంచి గతంలో మాదిరిగానే ఈ ఏరియాలో అక్రమ నిర్మాణాలు కడుతూనే ఉన్నారు. లోకల్ టౌన్ ప్లానింగ్ అధికారులను మేనేజ్ చేస్తూ అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. 50 గజాల్లోనే ఆరు, ఏడు అంతస్తులు కడుతున్న యజమానులు ప్రైవేట్ హాస్టల్స్ నిర్వహిస్తున్నారు.

గచ్చిబౌలి, మాదాపూర్లో ఐటీ ఉద్యోగాలు చేసే చాలా మంది అంజయ్య నగర్లోని హాస్టల్స్లోనే ఉంటున్నారు. దీంతో.. ఈ ప్రాంతంలో హాస్టల్స్ బిజినెస్ జోరందుకుంది. లోకల్ టౌన్ ప్లానింగ్ అధికారులను మేనేజ్ చేస్తూ కొత్తగా బిల్డింగులు కట్టి హాస్టల్స్ నడుపుతూ సేఫ్టీని గాలికొదిలేశారు. నాలాలకు ఆనుకుని అక్రమంగా నిర్మాణాలు చేయడం వల్ల ఇలాంటి అనర్థాలు జరిగి నిండు ప్రాణాలు పోతున్న పరిస్థితి.

అధికారుల కాసుల కక్కుర్తి, హాస్టల్స్ నడిపి కోట్లకు కోట్లు సంపాదించాలనే యజమానుల ధన దాహానికి అమాయక ప్రజలు ప్రాణాలు బలైపోతున్నాయి. గచ్చిబౌలిలో అధికారులు ఫోకస్ చేస్తే ఇలాంటి నిర్మాణాలు చాలానే కనిపిస్తాయి. భద్రతా ప్రమాణాలు గాలికొదిలేసి ఇరుకు, ఇరుకు గల్లీల్లో ఎన్నో హాస్టల్స్ నడుస్తూనే ఉన్నాయి.

©️ VIL Media Pvt Ltd.