Reading Time: < 1 minute
Police Impose Restrictions On Ys Jagan Mohan Reddys Srikakulam Visit

YS Jagan Srikakulam Visit: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (గురువారం రోజు) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించున్నారు.. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. జైలు వద్ద ములాఖాత్ కార్యక్రమం వరకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు. వైఎస్‌ జగన్ పర్యటన సందర్భంగా ర్యాలీలు, భారీ జనసమీకరణలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఎస్పీ స్పష్టం చేశారు. గతంలో జరిగిన క్రౌడ్ గేదరింగ్ ఘటనలు, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భద్రతా పరమైన అంశాలు, శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

పోలీసులు విధించిన నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ మహేశ్వర్‌ రెడ్డి హెచ్చరించారు. ప్రజలు, పార్టీ శ్రేణులు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌కు ఉన్న జడ్ ప్లస్ (Z+) భద్రతా కేటగిరీ ప్రకారం పూర్తి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే ఆయన కాన్వాయ్‌లో ఎనిమిది వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం రేపిన హిట్ అండ్ రన్ కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మకు ఊరట లభించింది. సోంపేట కోర్టు విధించిన షరతులతో కూడిన బెయిల్‌పై ఆరవ్ వర్మతో పాటు A2 సిద్ధార్థ్ త్యాడి అంపోలు జిల్లా జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. జైలు వద్దకు చేరుకున్న ఆరవ్ తల్లి శ్రీదేవి భావోద్వేగానికి గురై కుమారుడిని ముద్దాడుతూ ఆలింగనం చేసుకున్నారు. సిద్ధార్థ్ త్యాడిని కూడా ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఇద్దరినీ తన వాహనంలో ఎక్కించుకుని పలాసకు తీసుకెళ్లారు. ఇదే హిట్ అండ్ రన్ కేసులో మాజీమంత్రి సీదిరి అప్పలరాజు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా అంపోలు జైలులో ఉన్నారు. పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు గురువారం శ్రీకాకుళం వెళ్లనున్నారు వైఎస్‌ జగన్‌.. ఈ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించడంతో.. జగన్‌ పర్యటన ఎలా సాగనుంది అనేది ఉత్కంఠగా మారింది..