Reading Time: < 1 minute
Nitin Gadkari Pre 2016 Vehicles E20 Petrol Modifications

Nitin Gadkari: E20 (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా వినియోగదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్రం రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. 2005 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన భారత్ స్టేజ్-III (BS-III) ప్రమాణాల కింద తయారైన, 2016కు ముందు ఉత్పత్తి చేసిన కొన్ని వాహనాల్లో రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లను మార్చాల్సి రావొచ్చని చెప్పారు.

అయితే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (IIP), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (SIAM), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నిర్వహించిన అధ్యయనాల ప్రకారం, E20 పెట్రోల్ వినియోగానికి కార్లు, టూవీలర్ల ఇంజన్లలో ఎలాంటి మార్పులు అవసరం లేదని స్పష్టం చేశారు. పాత వాహనాలపై కూడా చేసిన అధ్యయనాల్లో పనితీరులో గణనీయమైన మార్పు, సమస్యలు లేవని గడ్కరీ వెల్లడించారు. డైవబిలిటీ, స్టార్టబిలిటీ, లోహాలు, ప్లాస్టిక్ భాగాల అనుకూలత వంటి అంశాల్లో కూడా ఎలాంటి సమస్యలు గుర్తించలేదని చెప్పారు.

2016కు ముందు తయారైన కొన్ని BS-III వాహనాల్లో మాత్రమే రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లు మార్చాల్సి రావచ్చని, వీటిని సాధారణ సర్వీసింగ్ సమయంలోనే సులభంగా మార్చొచ్చని తెలిపారు. E20 పెట్రోల్ వల్ల మాత్రమే మైలేజ్ తగ్గుతుందని చెప్పలేమని, వాహన పనితీరు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని, ఆటోమొబైల్ తయారీ సంస్థలు, పరీక్షలు చేసిన సంస్థలు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిపారు. E20 పెట్రోల్‌పై శాస్త్రీయ అధ్యయనాలు, దశలవారీగా అమలు, అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే అమలు చేస్తున్నామని గడ్కరి చెప్పారు. బ్రెజిల్ వంటి దేశాల్లో దశాబ్ధాలుగా అధిక ఇథనాల్ బ్లెండెట్ ఇంధనాన్ని విజయవంతంగా వినియోగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.