Reading Time: 2 minutes
EPFO: ‘ఈపీఎఫ్ 2026’ కొత్త నిబంధనలు ఇవే!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPFO చందాదారులకు అలర్ట్. పీఎఫ్ నగదు విత్‌డ్రా నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ‘ఉద్యోగుల భవిష్య నిధి పథకం, 2026’ను నోటిఫై చేసింది. జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం, పీఎఫ్ ఖాతా నుండి పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేయాలంటే ఖాతాలో కనీసం 25 శాతం నిధులను భవిష్యత్తు నిధిగా అలాగే ఉంచడం తప్పనిసరి చేశారు. కొత్త నిబంధనల ప్రకారం విత్‌డ్రా మొత్తాన్ని లెక్కించే ముందే ఈ 25 శాతం కనీస బ్యాలెన్స్‌ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ఒకరి పీఎఫ్ ఖాతాలో రూ.1 లక్ష ఉంటే, అందులో రూ.25,000 కనీస బ్యాలెన్స్‌గా లాక్ అవుతుంది. మిగిలిన రూ.75,000 మొత్తాన్ని మాత్రమే ‘అర్హత ఉన్న సభ్యుని బ్యాలెన్స్’ గా పరిగణించి, నిబంధనలకు లోబడి విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతిస్తారు. ఈ నియమం ఉద్యోగి, యాజమాన్యం వాటాలు రెండింటికీ వర్తిస్తుంది. కొత్త పథకం కింద గతంలో ఉన్న 13 రకాల విత్‌డ్రా నిబంధనలను 3 ప్రధాన కేటగిరీలుగా కుదించారు. ఉద్యోగంలో చేరిన 12 నెలల తర్వాతే పాక్షిక విత్‌డ్రాలకు అర్హత లభిస్తుంది. ఇల్లు లేదా ప్లాట్ కొనుగోలు, ఇందిరమ్మ ఇల్లు/గృహ నిర్మాణం, హోమ్ లోన్ రీపేమెంట్, ఇంటి మరమ్మతుల వంటి వాటితో పాటు అనారోగ్యం, పిల్లల ఉన్నత విద్య, వివాహం వంటి అత్యవసర ఖర్చుల కోసం ‘అర్హత ఉన్న బ్యాలెన్స్‌’ నుండి 100 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు, ప్రత్యేక పరిస్థితుల్లో విత్‌డ్రా చేసుకునేందుకు ఎలాంటి అదనపు కారణాలు లేదా వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అలాగే ఆటో-సెటిల్‌మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచారు. మరోవైపు సాంకేతికత సహాయంతో ఈపీఎఫ్ఓ సేవలను మరింత సులభతరం చేస్తోంది. చందాదారులు తమ పీఎఫ్ డబ్బులను నేరుగా యూపీఐ ద్వారా తమ బ్యాంకు ఖాతాల్లోకి పొందే సదుపాయాన్ని త్వరలోనే తీసుకురానుంది. దీనికి సంబంధించిన టెస్టింగ్ ఇప్పటికే విజయవంతంగా పూర్తయింది. దీనితో పాటు మరో నెల రోజుల్లో ‘వాట్సాప్’ ద్వారా కూడా కీలక సేవలను ప్రారంభించనున్నారు. ఈపీఎఫ్ఓ వెరిఫైడ్ వాట్సాప్ నంబర్‌కు ‘Hello’ అని మెసేజ్ పంపడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, చివరి ఐదు లావాదేవీల వివరాలు, క్లెయిమ్ స్టేటస్ ట్రాకింగ్ వంటివి ప్రాంతీయ భాషల్లోనే తెలుసుకోవచ్చు. ఒకవైపు పదవీ విరమణ నిధికి రక్షణ కల్పిస్తూనే, మరోవైపు డిజిటల్ సేవల ద్వారా 7 కోట్లకు పైగా సభ్యులకు మెరుగైన అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈపీఎఫ్ఓ ఈ మార్పులు చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడిలో హుండీలనే కాదు.. వీటిని కూడా కొట్టేస్తున్నారు..

రుషికొండ భవనాలు ఏం చేయబోతున్నారో తెలుసా?

బిర్యానీ ఫ్రీ అన్నారు.. తీరా అక్కడికి వెళ్లాక..

ద్రవ్యోల్బణం కంటే ‘ఏఐ’తోనే పెను ముప్పు ఆర్‌బీఐ సంచలన నివేదిక!

నాడు ఏకే-47 పట్టిన చేతులతోనే.. నేడు నాగలిపట్టి సేద్యం