Reading Time: < 1 minute
Ishan Kishan India Vs England 2nd T20i Loss Vaibhav Sooryavanshi

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైన తర్వాత, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టు ప్రదర్శనపై నిజాయితీగా స్పందించారు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. పవర్‌ప్లేలో భారత్ 65/2 స్కోరుతో బలంగానే కనిపించినప్పటికీ.. 7 నుండి 10 ఓవర్ల మధ్య కేవలం 32 పరుగులు మాత్రమే చేసింది. అలాగే 14-17 ఓవర్ల మధ్య కేవలం 23 పరుగులే వచ్చాయి. ఇంకొన్ని పరుగులు రాబట్టాల్సింది కానీ పిచ్ పరిస్థితుల కారణంగా కుదర్లేదు అని ఇషాన్ పేర్కొన్నాడు.

ఇక.. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ముఖ్యంగా 17వ ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. రవి బిష్ణోయ్ వేసిన రెండు నో-బాల్స్, వాటి వల్ల వచ్చిన ఫ్రీ-హిట్‌లు ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ (76 నాటౌట్) పై ఒత్తిడిని తగ్గించాయని ఇషాన్ అభిప్రాయపడ్డారు. ఎలాంటి శ్రమ లేకుండా ప్రత్యర్థికి 12 పరుగులు ఇవ్వడం టీ20ల్లో భారీ నష్టాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఓవర్ మాత్రమే మా ఓటమిని శాసించిందని స్పష్టం చేశాడు.

నంబర్ వన్ ర్యాంకింగ్..
ఇటీవలే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్న కిషన్, ఫలితాల గురించి ఆలోచించకుండా ప్రతిరోజూ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెట్టడం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. వరుస ఓటములు మానసికంగా ప్రభావం చూపుతాయని, అయితే జట్టులోని ఆటగాళ్లంతా పరిణతి చెందిన వారు కాబట్టి కలిసికట్టుగా పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం..
సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొడుతూ, 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే భారత్ తరఫున అరంగేట్రం చేసిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని కిషన్ ప్రశంసించారు. వైభవ్ అసాధారణమైన ప్రతిభావంతుడని, సీనియర్లుగా అతనికి అండగా ఉంటూ, అతని ప్రత్యేకమైన ఆటతీరును కాపాడటం తమ బాధ్యతని ఇషాన్ కిషన్ పేర్కొన్నారు.