
దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్, ఆయన భార్య (ప్రథమ మహిళ) కిమ్ హ్యే-క్యుంగ్‌లకు సంబంధించిన ఒక చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. రోడ్డు పక్కన ఉన్న ఒక దుకాణంలో భార్య వస్తువు ధర అడగ్గానే, భర్త వెంటనే పర్స్ తీయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అసలు విషయం ఏంటంటే… గత నెల జూన్ 25న ఈ అధ్యక్ష దంపతులు ఇద్దరూ కలిసి సువాన్ నగరంలోని ఫెమస్ ‘పల్దల్‌మున్’ మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ సాధారణ ప్రజల్లాగే రద్దీగా ఉన్న వీధుల్లో నడుస్తూ, స్థానిక వ్యాపారులతో మాట్లాడారు.
అలా నడుచుకుంటూ వెళ్తుండగా, ప్రథమ మహిళ అయినా కిమ్ హ్యే-క్యుంగ్ ఒక రోడ్డు పక్కన ఉన్న షాప్ దగ్గర ఆగి.. అక్కడ ఉన్న ఒక వస్తువు ధర ఎంత అని దుకాణదారుడిని అడిగారు. ఆమె ప్రశ్న పూర్తి కాకముందే.. పక్కనే ఉన్న అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ ఏమాత్రం ఆలోచించకుండా, డబ్బులు ఇవ్వడానికి జేబులోంచి పర్స్ బయటకు తీశారు.
నెటిజన్లు ఏమంటున్నారంటే
కేవలం కొన్ని సెకన్ల పాటు ఉన్న ఈ చిన్న వీడియో క్లిప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్ల మనసులను గెలుచుకుంది. “పెద్ద పదవుల్లో ఉన్నా కూడా ఇంట్లో భార్యాభర్తల బంధం ఇంతే సహజంగా ఉంటుందని చెప్పడానికి ఈ వీడియోనే ఉదాహరణ” అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.
►ALSO READ | ‘జనాలు అతన్ని ద్వేషిస్తారనుకున్నా..కానీ ఏడవడం చూసి షాక్ అయ్యా’: ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్..
“షాపింగ్‌కు వెళ్లినప్పుడు భార్య ఏదైనా నచ్చి ధర అడగ్గానే.. ఏ భర్త అయినా వెంటనే పర్స్ తీస్తాడు, ఈయన కూడా అలాగే చేశారు” అంటూ నవ్వుకుంటున్నారు.
కేవలం పబ్లిసిటీ కోసం కాకుండా, స్థానిక చిన్న వ్యాపారులను ప్రోత్సహించడానికి వారు అక్కడికి వెళ్లడాన్ని మరికొందరు మెచ్చుకుంటున్నారు.
ఆ మార్కెట్‌లో ఏం కొన్నారంటే:
వీరు ఆ మార్కెట్ అంతా తిరుగుతూ.. లోకల్ స్నాక్స్ అయిన బక్వీట్ చిప్స్, మరమరాలు, ఎండబెట్టిన చిన్న ఆక్టోపస్, స్క్విడ్, డోనట్స్, వేరుశెనగ స్నాక్స్ లాంటి చాలా రకాల పదార్థాలను రుచి చూసి మరీ కొన్నారు. దారిలో కలిసిన స్థానిక ప్రజలకు కూడా వాటిని తినిపిస్తూ సరదాగా గడిపారు.
ఫెమస్ ‘సువోన్ హ్వాసియోంగ్’ కోట దగ్గర ఉండే ఈ పల్దల్మున్ మార్కెట్ అక్కడ చాలా ఫేమస్. ఏదేమైనా, సాధారణ భర్తలాగే ప్రవర్తించిన దక్షిణ కొరియా అధ్యక్షుడి తీరు ఇప్పుడు ఇంటర్నెట్‌లో అందరికీ నచ్చే ఒక మధురమైన క్షణంగా నిలిచిపోయింది.