
Ind Vs Ire : భారత క్రికెట్ అభిమానులకు అస్సలు జీర్ణించుకోలేని షాక్ తగిలింది. ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా అక్కడ జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 0-2 తేడాతో ఘోరంగా చేజార్చుకుంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత జట్టు రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ నిర్ణయం తీవ్రంగా బెడసికొట్టింది. సొంతగడ్డపై ఆడే పిచ్‌లు లభించకపోవడంతో మన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. రెండు మ్యాచ్‌ల్లోనూ ఐర్లాండ్ నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించలేక టీమిండియా చేతులెత్తేసింది. ఫలితంగా దాదాపు 1050 రోజుల తర్వాత భారత్ ఒక బలహీనమైన జట్టు చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడమే కాకుండా, తన పేరిట 10 అవమానకరమైన రికార్డులను లిఖించుకుంది.
ఈ సిరీస్‌లో అభిమానులను మరింత నిరాశకు గురిచేసిన విషయం ఏమిటంటే.. సీనియర్ బ్యాటర్ సంజూ శాంసన్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఎదుర్కొన్న మొదటి బంతికే జయ్ మూంద్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మరోవైపు, ఐపీఎల్‌లో సంచలనాలు సృష్టించిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని రెండు మ్యాచ్‌ల్లోనూ బెంచ్‌కే పరిమితం చేశారు. అతనికి ఇంటర్నేషనల్ డెబ్యూ చేసే చాన్స్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఐర్లాండ్ చేతిలో ఓటమి తర్వాత భారత్ మూటగట్టుకున్న ఆ 10 ఘోరమైన రికార్డులు చూద్దాం..
1. 1050 రోజుల తర్వాత వరుస ఓటములు
భారత జట్టు టి20 క్రికెట్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడం దాదాపు 1050 రోజుల తర్వాత ఇదే మొదటిసారి. దీనికి ముందు చివరిసారిగా ఆగస్టు 2023లో వెస్టిండీస్ పర్యటనలో భారత్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది.
2. శ్రేయస్ అయ్యర్ పేరిట అప్రతిష్ట
భారత టి20 క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి, ఆడిన మొదటి రెండు టి20 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన రెండో కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నిలిచారు. అంతకుముందు రిషబ్ పంత్ కప్టెన్సీలో భారత్ ఇలా మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది.
3. ర్యాంకింగ్స్‌లో కొండంత తేడా ఉన్నా పరాజయం
ఐసిసి టి20 ర్యాంకింగ్స్‌లో ఐర్లాండ్ కనీసం టాప్-10 లో కూడా లేదు. ఐర్లాండ్ బ్యాటర్లు ఎవరూ టాప్-50 లో లేరు. అదే సమయంలో భారత్ నంబర్ వన్ స్థానంలో ఉంది, మన ఇద్దరు బ్యాటర్లు టాప్-2 లో ఉన్నారు. అయినా సరే వరల్డ్ ఛాంపియన్ ఇండియా ఘోరంగా సిరీస్ ఓడిపోయింది.
4. తిలక్ వర్మ అత్యంత నెమ్మదైన హాఫ్ సెంచరీ
ఈ సిరీస్‌లో తిలక్ వర్మ 46 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టి20 క్రికెట్ చరిత్రలో ఒక భారతీయ బ్యాటర్ చేసిన ఆరో అత్యంత నెమ్మదైన హాఫ్ సెంచరీ ఇది. ఈ లిస్ట్‌లో కెఎల్ రాహుల్ (56 బంతుల్లో సౌతాఫ్రికాపై) మొదటి స్థానంలో ఉన్నాడు.
5. అభిషేక్ శర్మ రికార్డు స్థాయి డకౌట్లు
యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు 2026 సంవత్సరం అస్సలు కలిసిరావడం లేదు. ఈ ఏడాదిలో అతను ఏకంగా 9వ సారి సున్నా (0) పరుగులకే అవుట్ అయ్యాడు. దీనితో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా రషీద్ ఖాన్ (2019), షాదాబ్ ఖాన్ (2024) రికార్డులను సమం చేశాడు.
6. 7 ఏళ్ల తర్వాత రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఓటమి
రెండు మ్యాచ్‌లు మాత్రమే ఉండే టి20 సిరీస్‌లలో భారత్ ఓడిపోవడం గత 7 ఏళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 2019లో ఆస్ట్రేలియా చేతిలో స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత్ పోగొట్టుకుంది.
7. ఈ దశాబ్దంలో మూడో సిరీస్ ఓటమి
2020 నుంచి మొదలైన ఈ దశాబ్దంలో భారత్ ఓడిపోయిన మూడో టి20 సిరీస్ ఇది. శ్రేయస్ అయ్యర్ కంటే ముందు 2021లో శిఖర్ ధవన్ కెప్టెన్సీలో లంకపై, 2023లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో విండీస్‌పై భారత్ సిరీస్ ఓడిపోయింది.
8. ఒక్క మ్యాచ్ కూడా గెలవని కెప్టెన్‌గా శ్రేయస్
ఒక పూర్తి టి20 సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన భారత కెప్టెన్ల లిస్ట్‌లో శ్రేయస్ అయ్యర్ చేరిపోయాడు. గతంలో 2009-15 మధ్య ఎంఎస్ ధోని, 2019లో విరాట్ కోహ్లీ మాత్రమే కెప్టెన్లుగా ఉండి సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయారు.
9. ముగిసిన 16 వరుస సిరీస్‌ల అజేయ పరంపర
ఐర్లాండ్ చేతిలో ఓటమితో భారత్ వరుసగా 16 టి20 సిరీస్‌లు గెలుస్తూ వచ్చిన అద్భుతమైన రికార్డుకు బ్రేక్ పడింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక వరుస సిరీస్ విజయాల రికార్డు. ఈ లిస్ట్‌లో పాకిస్తాన్ (11 సిరీస్‌లు) రెండో స్థానంలో ఉంది.
10. హిస్టరీలోనే మొదటిసారి ఐర్లాండ్ చేతిలో సిరీస్ లాస్
క్రికెట్ చరిత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఐర్లాండ్ జట్టుతో భారత్ ఆడిన ఏ సిరీస్‌ను కూడా కోల్పోలేదు. కానీ గౌతమ్ గంభీర్ కోచింగ్ లోనే మొదటిసారి ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుకు సిరీస్ సమర్పించుకోవాల్సి వచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..