
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి వ్యాపారుల సిండికేట్ వ్యవహారం ఇప్పుడు మధురం పండించే రైతాంగానికి కంటతడి పెట్టిస్తోంది. సీజన్ ముగుస్తున్నా ఆశించిన ధర అందక మామిడి రైతు దిగాలు చెందుతున్న పరిస్థితి నెలకొంది. ర్యాంపులు, మండీల్లో మామిడి కొనుగోలు దందా కొనసాగుతోంది. రైతును నిండా ముంచేస్తున్న పరిస్థితి నెలకొంది. మామిడి టన్నుకు రూ. 3 వేలకు మించి ఇవ్వని వ్యాపారుల నిర్వాకం మామిడి రైతు వెన్ను విరుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సాగు విస్తీర్ణం 3.85 లక్షల ఎకరాలు కాగా అన్నమయ్య జిల్లాలో రెండు లక్షల ఎకరాల మేర మామిడి సాగైంది. తిరుపతి చిత్తూరు అన్నమయ్య ఈ మూడు జిల్లాల పరిధిలో తోతాపూరి రకం మామిడి సాగు 1.70 లక్షల ఎకరాల్లో ఉండగా, తోతాపూరి దిగుబడి దాదాపు 7.50 మెట్రిక్ టన్నులు మేర ఉంది. మామిడి సీజన్ ప్రారంభం నుంచే గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు సిండికేట్ కావడం పరిపాటిగానే ఈ ఏడాది పరిస్థితి అదేలా మారింది.
చిత్తూరు పరిధిలోని బంగారుపాళ్యం తిరుపతి జిల్లాలోని పాకాల, దామలచెరువు, మోగరాల, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, చిన్నమండెం, గాలివీడు, సంబేపల్లి, పీలేరు, కలకడ, గుర్రంకొండ, పుంగనూరు ప్రాంతాల్లో ర్యాంపులు ఏర్పాటు చేసి మామిడి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు దందా కొనసాగిస్తున్నారు. ప్రతి ఏటా వ్యాపారుల దగా కు రైతులు గురవుతున్నారు. ర్యాంపు లు ఏర్పాటు చేసుకుని సిండికేట్ గా మారిన వ్యాపారులు తోతాపురి కిలో రూ. 3 మించి ధర ఇవ్వడం లేదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన తోతాపూరి కిలో రూ. 8 నుంచి 10 దాకా అమ్ముకుంటున్న వ్యాపారులు రైతును మాత్రం దగాకు గురి చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 శాతానికి పైగా మామిడి కోతులు పూర్తి చేసిన రైతాంగం ఇప్పటిదాకా ఆశించిన ధర లను మాత్రం పొందలేక పోయింది.
తోతాపురి రకం మామిడికి టన్నుకు రూ. 4 వేలు ప్రోత్సాహక నగదును ప్రకటించిన ప్రభుత్వం రాంపులు గుజ్జు పరిశ్రమలు మండిల్లో టన్ను రూ. 8 వేలు తగ్గకుండా కొనుగోలు చేయాలని చెబుతున్నారు. ఆ రేటుకు రైతు అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. అధికార యంత్రాంగం అలసత్వంతో మామిడి రైతుకు ప్రభుత్వం సూచించిన ధర అందకపోతోంది. దీంతో అయిన కాడికి అమ్ముకుంటున్న రైతు ఈ ఏడాది కూడా చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మామిడి సాగు చేయడం మధురం కాదని ఇదో చేదు అనుభవమన్న అభిప్రాయం రైతు నుంచి వ్యక్తం అవుతుంది. మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద రైతులు ఆత్మహత్యాయత్నానికి దిగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
ధర కాదు కొంటే చాలురా దేవుడా..
మరోవైపు సాగు చేసిన మామిడి కి గిట్టుబాటు ధర దేవుడెరుగు, కనీసం కొనుగోలు చేసే నాథుడైనా ఉంటే చాలు అన్నట్టు రైతులు వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. మామిడి కోసి ట్రాక్టర్లలో గుజ్జు పరిశ్రమల వద్ద కు వస్తున్న రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. సహనం కోల్పోయి రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్న పరిస్థితి దాపురిస్తోంది. మామిడి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని చిత్తూరు పుత్తూరు రహదారి పై రోజు రైతులు ధర్నా చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. గంగాధర నెల్లూరు మండలం జైన్ ఫ్యాక్టరీ ఎదురుగా రైతులు ఆందోళన పరిపాటిగా మారిపోయింది.
పెద్దిరెడ్డి ఫ్యాక్టరీ మామిడి రైతును ఆదుకుంటే మీసం తీసేస్తా..!
మరోవైపు మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని మద్దతుగా నిలుస్తున్న వైసీపీ కూటమి ప్రభుత్వ తీరును ఎండ గడుతోంది. మామిడి కొనుగోళ్లలో జరుగుతున్న దగాపై వైసీపీ నిలదీస్తోంది. దీంతో మామిడి కొనుగోళ్లు, ధరలపై వైసీపీ చేస్తున్న ఆందోళనను అధికార పార్టీ తప్పుపడుతోంది. మామిడి ధరలపై వైసీపీ ధర్నాలను ప్రశ్నిస్తున్న టిడిపి ఎమ్మెల్యే థామస్ వైసీపీ నాయకులకు సవాల్ విసురుతున్నారు. మామిడి రైతులను చిత్తశుద్ధితో ఆదుకుంటున్నా మని చెబుతున్నారు. రైతుల పక్షాన నిలబడిన గుజ్జు పరిశ్రమలు మామిడి కొనుగోలు చేస్తున్నాయంటున్నారు. వైసీపీ నేతలు లేనిపోని రాద్ధాంతం చేసి రైతులను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే థామస్ ఆరోపిస్తున్నారు. మామిడి రైతులను ఆదుకున్న చరిత్ర వైసీపీ కి లేదని మామిడి రైతులను ఆదుకున్న ఏకైక పార్టీ టిడిపి అంటున్నారు.